Site icon NTV Telugu

Punjab: దిగ్గజాలను ఊడ్చేసిన ‘చీపురు’

ఢిల్లీకి పరిమితం అనుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఇతర రాష్ట్రాలపై కూడా ఫోకస్‌ పెట్టింది.. అందులో భాగంగా పంజాబ్‌పై ప్రధానంగా కేంద్రీకరించారు ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు.. ఆప్‌ ప్రభంజనంలో సీఎం, మాజీ సీఎంలు, రాజకీయ దిగ్గజాలు సైతం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.. రాజకీయాల్లో పాతుకుపోయిన నేతలు సైతం ఇంటి బాట పట్టారంటే.. ఆప్‌ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు..

Read Also: Mayor: థియేటర్లకు మేయర్‌ లేఖ.. కొత్త సినిమా వస్తే ప్రతీ షోకు వంద టికెట్లు ఇవ్వండి..

ఇక, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, శిరోమ‌ణి అకాలీద‌ళ్ చీఫ్ సుఖ్బీర్ బాద‌ల్‌, ఏకంగా ఐదుసార్లు సీఎంగా సేవలు అందించిన ప్రకాష్‌ సింగ్ బాద‌ల్, మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌ సైతం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.. సీఎం చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చెన్నీ రెండు స్థానాల నుంచి బ‌రిలోకి దిగారు.. అయితే, భ‌దౌడా, చ‌మ‌కౌర్ సాహిబ్ రెండు స్థానాల్లో ఓటమి తప్పలేదు.. ఇక, అమృత్ స‌ర్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన పీసీసీ చీఫ్‌ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ పరాజయం పాలయ్యారు.. అజ‌య్ గుప్తా అనే ఆప్ అభ్యర్థి సిద్ధూను ఓడించారు. మరోవైపు.. పంజాబ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ఓపీ సోనీ.. అమృత్ స‌ర్ సెంట్రల్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు పంజాబ్‌ సీఎంగా పనిచేసిన అమ‌రీంద‌ర్ సింగ్.. పాటియాలా నుంచి బ‌రిలోకి దిగారు. ఆప్ అభ్య‌ర్థి అజీత్ సింగ్ కోహ్లీ చేతిలో ఓడిపోయారు. శిరోమ‌ణీ అకాలీద‌ళ్ అధ్య‌క్షుడిగా ఉన్న సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్.. జ‌లాలాబాద్ నుంచి పోటీ చేసి ఆప్ అభ్య‌ర్థి జ‌గ‌దీప్ కంబోజీ చేతిలో పరాజయం పాలయ్యారు.. ఇక, మాజీ సీఎం శిరోమ‌ణి అకాలీద‌ళ్ అగ్రనేత‌ అయిన ప్రకాష్‌ సింగ్ బాద‌ల్.. లంబీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగి ఆప్ అభ్య‌ర్థి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ చేతిలో ఓడిపోయారు.. ఇలా ఎంతోమంది ప్రముఖులను మట్టి కరిపించారు ఆప్‌ అభ్యర్థులు.

Exit mobile version