Budget 2023: గత రెండేళ్లుగా బడ్జెట్‌లో వేతన జీవులకు నిరాశే మిగులుతోంది. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వేతన జీవులకు ట్యాక్స్ మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అయితే వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈసారి ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు ఉంటాయని ఆర్ధిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 4 శ్లాబుల ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపులు లభిస్తున్నాయి. రూ.2.5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఆదాయం పొందుతున్న వారు 5 శాతం ఇన్‌కమ్ టాక్స్ చెల్లించాలి. ఆదాయం రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉంటే ఆ మొత్తానికి 20 శాతం ఇన్‌కమ్ టాక్స్ చెల్లించాలి. రూ. 10 లక్షల పైబడి ఆదాయం ఉంటే ఇన్‌కమ్ టాక్స్ 30 శాతం చెల్లించాలి.
Read Also: CM Jagan: ఫించన్‌లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కలెక్టర్లు తిప్పికొట్టాలి
కాగా డెలాయిట్ ఇండియా అంచనాల ప్రకారం వచ్చే బడ్జెట్‌లో రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం ఉన్న పన్ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. సెక్షన్ 80 సీ మినహాయింపులు కూడా రూ. 1,50,000 నుంచి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వేతన జీవులందరూ స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా రూ. 50 వేల మినహాయింపు పొందుతున్నారు. అలాగే హెచ్‌ఆర్‌ఏ ఎగ్జెంప్షన్ కింద రెంట్ రిసీప్ట్ సమర్పించడం ద్వారా కొంత మినహాయింపు పొందుతున్నారు. ఇక సెక్షన్ 80 సీ ద్వారా రూ. 1,50,000 ఆదాయానికి పన్ను మినహాయింపు కోరవచ్చు. ఇందులో ఈపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇద్దరు పిల్లలకు స్కూల్ ఫీజు, ఇన్సూరెన్స్ ప్రీమియం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఈఎల్ఎస్ఎస్, యూలిప్, 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటివి చూపుతున్నారు. అటు సెక్షన్ 80డీ కింద రూ.25వేల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చూపించి మినహాయింపు పొందవచ్చు.
