NTV Telugu Site icon

Lateral Entry Row: ప్రతిపక్షాల ఒత్తిడి తర్వాత లాటరల్ ఎంట్రీపై కేంద్రం యూ-టర్న్..

Lateral Entry

Lateral Entry

Lateral Entry Row: బ్యూరోక్రసీలో లాటరల్ ఎంట్రీకి సంబంధించిన ప్రకటనను రద్దు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) అధిపతికి లేఖ రాశారు. ఇటీవల యూపీఎస్‌సీ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉన్నత స్థానాలకు లాటరల్ ఎంట్రీ నియామకాల కోసం ‘‘ప్రతిభావంతులైనవారిని’’ కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. 24 మంత్రిత్వ శాఖల్లో జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ వంటి 45 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ శాఖల్లో స్పెషలిస్టు(ప్రైవేట్ రంగానికి చెందిన వారితో సహా) నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడింది. భారతదేశ పరిపాలన యంత్రాంగం, సామర్థ్యాన్ని, ప్రతిస్పందనను పెంచేందుకు నిపుణుల అవసరాన్ని గుర్తించడం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ హయాంలో లాటరల్ ఎంట్రీ పథకాన్ని అధికారికంగా ప్రవేశపెట్టారు.

Read Also: Supreme Court: ‘‘అమ్మాయిలు మీ లైంగిక కోరికల్ని నియంత్రించుకోండి’’.. హైకోర్టు తీర్పుని కొట్టేసిన సుప్రీంకోర్టు..

అయితే, దీనిపై కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉన్నత పదవుల్లో కేంద్రం ఆర్ఎస్ఎస్ వ్యక్తుల్ని తీసుకురావాలని అనుకుంటోందని మండిపడ్డారు. ఈ చర్య ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు దెబ్బగా అభివర్ణించారు. ప్రతిపక్షాల నుంచే కాకుండా మిత్రపక్షాల నుంచి కూడా అభ్యంతరాలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

లాటరల్ ఎంట్రీ ప్రకటనని రద్దు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలతో యూపీఎస్సీ చైర్ పర్సన్ ప్రతీ సుడాన్‌కి కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు. రాజ్యాంగంలోని సమానత్వం, సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణంగా లాటరల్ ఎంట్రీ ప్రవేశాలు అవసరం అని, ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ‘‘చారిత్రక అన్యాయాలను పరిష్కరించడం మరియు కలుపుకొనిపోవడాన్ని ప్రోత్సహించే లక్ష్యం మా సామాజిక న్యాయ ఫ్రేమ్‌వర్క్‌కు మూలస్తంభం’’ అని మోడీ భావిస్తున్నారని సింగ్ అన్నారు.

“ఈ స్థానాలను స్పెషలైజ్డ్‌గా పరిగణించి, సింగిల్ కేడర్ పోస్టులుగా నియమించారు కాబట్టి, ఈ నియామకాలలో రిజర్వేషన్‌కు ఎటువంటి నిబంధన లేదు” అని లేఖలో పేర్కొన్నారు. సామాజిక న్యాయంపై ప్రధాని దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అంశాన్ని సమీక్షించి, సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. లాటరల్ ఎంట్రీ రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటనను రద్దు చేయాలని తాను యూపీఎస్‌సీని కోరుతున్నానని, ఈ దశ సామాజిక న్యాయం మరియు సాధికారత సాధనలో గణనీయమైన పురోగతి అవుతుందని చెప్పారు.