NTV Telugu Site icon

Port Blair renamed: “పోర్ట్ బ్లెయిర్” పేరు మార్చిన కేంద్రం..ఇకపై ఇలా పిలవాలి..

Port Blair

Port Blair

Port Blair: అండమాన్ అండ్ నికోబార్ దీవుల రాజధాని ‘‘పోర్ట్ బ్లెయిర్’’ పేరుని మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వలసవాద ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు కేంద్రం ఈ చర్య తీసుకున్నట్లు చెప్పింది. పోర్ట్ బ్లెయిర్‌కి కొత్తగా ‘‘శ్రీ విజయ పురం’’ అనే పేరుని పెట్టింది. పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశస్థానం. బ్రిటీష్ వలసవాద పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటీష్ అధికారి కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిన్ పేరు మీద ఈ పట్టణానికి ‘‘పోర్ట్ బ్లెయిర్‌’’గా పేరు పెట్టారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘‘వలసవాద వారసత్వం మునపటి పేరు ఉన్నప్పటికీ.. శ్రీ విజయ పురం మన స్వాతంత్య్ర పోరాటంలో సాధించిన విజయానికి, అండమాన్ నికోబార్ దీవుల విశిష్ట పాత్రకు ప్రతీక’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ మన స్వాతంత్య్ర పోరాటంలో మన చరిత్రలో అండమాన్ నికోబార్ దీవులకు అసమానమైన స్థానం ఉంది. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నావికా స్థావరంగా పనిచేసిన ద్వీప భూభాగం నేడు మన వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు కీలకమైన స్థావరంగా మారింది’’ అని అమిత్ షా అన్నారు.

Read Also: Tajikistan: 96 శాతం ముస్లింలున్న దేశంలో హిజాబ్ పై నిషేధం.. మసీదుల స్థానంలో కేఫ్‌లు, హాల్స్‌!

‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత మన తిరంగా మొదటి ఆవిష్కరణకు ఆతిథ్యం ఇచ్చిన ప్రదేశం, వీర్ సావర్కర్, ఇతర స్వాతంత్య్ర పోరాట యోధులు స్వతంత్ర దేశం కోసం పోరాడిన సెల్యూలర్ జైలు కూడా ఇదే’’ అని కేంద్ర హోం మంత్రి చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఎంతో మంది సమరయోధులను బ్రిటీష్ వారు ఇక్కడి సెల్యూలర్ జైలులో ఉంచి హింసించేవారు. ప్రస్తుతం ఇది నేషనల్ మెమోరియల్‌గా ప్రసిద్ధి చెందింది.

జూలై నెలలో రాష్ట్రపతి భవన్ ఐకానిక్ ‘దర్బార్ హాల్’ మరియు ‘అశోక హాల్’కి గణతంత్ర మండపం, అశోక్ మండపంగా పేరు మార్చారు. భారతీయ సాంస్కృతిక విలువలు మరియు నైతికతలను ప్రతిబింబించేలా రాష్ట్రపతి భవన్ వాతావరణాన్ని రూపొందించడానికి స్థిరమైన ప్రయత్నం జరిగిందని రాష్ట్రపతి సెక్రటేరియట్ తెలిపింది. రక్షణ దళాలలో, వలసరాజ్యాల వారసత్వాన్ని తొలగించడానికి కేంద్రం, భారత నావికాదళ సిబ్బంది అందరూ లాఠీలను మోసే పద్ధతిని తొలగించడాన్ని తక్షణమే అమలులోకి తెచ్చింది.