NTV Telugu Site icon

Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ యాప్‌తో సహా 22 యాప్స్, వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం..

Betting App

Betting App

Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ యాప్‌‌తో సహా 21 అక్రమ బెట్టింగ్ యాప్స్, సాఫ్ట్‌వేర్ మరియు వెబ్‌సైట్లను కేంద్రం బ్లాక్ చేసింది. మహాదేవ్ యాప్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు చేస్తున్న క్రమంలో కేంద్రం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. మహాదేవ్ బుక్ మరియు రెడ్డిఅన్నాప్రెస్టోప్రోతో సహా 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లకు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Irfan Pathan: “గాజా”పై ఇర్ఫాన్ పఠాన్ పోస్ట్.. పాకిస్తాన్ హిందువుల గురించి మాట్లాడాలన్న కనేరియా..

ఈడీ సిఫార్సుల తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఉత్తర్వులను జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్ సిండికేట్‌పై ఈడీ విచారణ, ఛత్తీస్గఢ్ లోని మహాదేవ్ బుక్ చట్టవిరుద్ద కార్యకలాపాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఛత్తీస్గఢ్ ఎన్నికల ముందు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్ మెడకు చుట్టుకుంది. ఇటీవల ఈడీ రైడ్స్‌లో రూ.5 కోట్లతో ఓ కొరియర్ పట్టుబడ్డాడు. ఈ డబ్బును ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం బఘేల్ కి బెట్టింగ్ యాప్ ఓనర్ శుభమ్ సోని పంపాడని ఈడీ ముందు చెప్పినట్లు సమచారం. ఈ యాప్ ప్రమోటర్లు సీఎంకి రూ.508 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ రోజు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ శుభమ్ సోని దుబాయ్ నుంచి ఓ వీడియోలో మాట్లాడారు. తనను దుబాయ్ వెళ్లమని సలహా ఇచ్చింది సీఎం బఘేల్ అని తెలిపారు.

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావాలంటే సెక్షన్ 69ఏ ఐటీ చట్టం ప్రకారం యాప్, వెబ్సైట్‌ని ఎప్పుడో మూసేసి ఉండొచ్చని, రాష్ట్రానికి ఆ అధికారం ఉందని అన్నారు. ప్రస్తుత మహదేవ్ కేసులో ఆ రాష్ట్రానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ భీమ్ సింగ్, మరో అనుమానితుడు అసిమ్ దాస్ మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ కస్టడీలో ఉన్నారు.