New Airlines: భారతీయ విమానయాన రంగంలో ఇండిగో, ఎయిర్ ఇండియాల ‘‘డ్యుపోలీ’’ని అంతం చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ రెండు సంస్థల గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రెండు కొత్త విమానయాన సంస్థలు, అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్‌లకు నో అబ్జక్షన్ సర్టిఫికేట్(NOCలు) మంజూరు చేసింది. ప్రస్తుతం దేశ వైమానిక రంగంలో ఇండిగో, ఎయిర్ ఇండియా దేశీయ మార్కెట్‌లో 90 శాతానికి పైగా నియంత్రిస్తున్నాయి. ఒక్క ఇండిగోనే 65 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. ఇటీవల, ఇండిగో సంక్షోభం వల్ల దేశ వైమానిక రంగం కుదేలైంది. కొన్ని ఎయిర్‌లైన్లపై ఆధారపడితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయనే దానికి ఇండిగో ఒక ఉదాహరణగా నిలిచింది.
Read Also: AP Health Department: గిరిజన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా.. ఆరోగ్యశాఖ కీలక ఒప్పందం
పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మంగళవారం ఎక్స్‌లో తాజా అనుమతుల్ని ధ్రువీకరించారు. శంఖ్ ఎయిర్, అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్‌లతో మంత్రిత్వ శాఖ సమావేశాలు నిర్వహించిందని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన శంఖ్ ఎయిర్ ఇప్పటికే ఎన్‌ఓసీని కలిగి ఉందని, 2026లో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించే అవకాశం ఉందని, అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ ఈ వారంలో అనుమతులు పొందినట్లు ఆయన తెలిపారు.
దేశీయ విమానయాన రంగంలో కొత్త సంస్థల్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో 9 షెడ్యూల్డ్ దేశీయ ఎయిర్‌లైన్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిలో ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, అలయన్స్ ఎయిర్, అకాసా ఎయిర్, స్పైస్‌జెట్, స్టార్ ఎయిర్, ఫ్లై91, ఇండియావన్ ఎయిర్ ఉన్నాయి.
