Indus River: సింధు నది జలాల కోసం కేంద్రం కొత్త ప్లాన్‌తో సిద్ధమవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల దాహార్తిని, సాగు అవసరాలను తీర్చేందుకు కేంద్రం సింధు నది వ్యవస్థలో భారీ మార్పులు చేయాలని భావిస్తోంది. పాకిస్తాన్‌తో ‘‘సిందు జల ఒప్పందాన్ని’’ నిలిపేసిన తర్వాత, కేంద్రం ఈ వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. 2029 లోక్‌సభ ఎన్నికల ముందు ఈ ప్రాజెక్ట్ సిద్ధం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
గత శుక్రవారం సీనియర్ మంత్రులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సింధు నదిని దాని ఉప నది అయిన బియాస్ నదితో అనుసంధానించేందుకు 14 కి.మీ సొరంగాన్ని నిర్మించేందుకు డీపీఆర్ ఇప్పటికే సిద్ధమవుతోందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ నివేదికను తయారు చేసే బాధ్యతను అప్పగించారు. ఇది వచ్చే ఏడాది నాటికి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు సింధు నది జలాలను సరఫరా చేసే ప్రతిపాదిత 113 కి.మీ కాలువ పనులనున కూడా సమావేశంలో చర్చించారు.
Read Also: Ladakh : రగులుతున్న లద్దాక్, రాష్ట్ర హోదా కోసం రగులుతున్న డిమాండ్లు
1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. అయితే, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ఈ ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. ఇప్పుడు, కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే, భారత్ సమర్థవంతంగా సింధు జలాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పాకిస్తాన్ కు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఏమవుతుందనే సందేశాన్ని కూడా ఇచ్చినట్లు అవుతుంది.
ఈ ప్రాజెక్టులో అత్యంత సవాలుతో కూడుకున్నది ఈ 14 కి.మీ సొరంగ మార్గం. పర్వత ప్రాంతాల్లో నిర్మితమవుతున్న నేపథ్యంలో శిలలను సమర్థవంతంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వేగంగా, సురక్షితంగా ప్రాజెక్టు చేపట్టడానికి టెన్నెల్ బోరింగ్ యంత్రాలు, రాక్ షీల్డ్ టెక్నాలజీని ఉపయోగించాలని చూస్తున్నారు. ఈ సొరంగం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఉజ్ ప్రాజెక్టులో అనుసంధానించబడుతుంది. రావి నందికి ఉప నది అయిన ఉజ్ నది నుంచి బియాస్ బేసిన్‌కు నీటిని తరలించడానికి వీలు కలుగుతుంది. 2028 నాటికి పూర్తి చేయాలనుకునే ఈ ప్రాజెక్టు విలువ రూ. 4000-8000 కోట్లుగా ఉంటుందని అంచనా. దీని వల్ల రాజస్థాన్‌లోని శుష్క ప్రాంతాలకు ఇందిరాగాంధీ కాలువ ద్వారా నీటిని అందిచవచ్చు. జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు దీని ద్వారా ప్రయోజనం పొందుతాయి.
