NTV Telugu Site icon

Delhi: విద్యార్థులకు షాక్.. నో డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేసిన కేంద్రం

Student

Student

పాఠశాల విద్యలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యావ్యవస్థలో అమలవుతున్న నో డిటెన్షన్ విధానాన్ని తాజాగా కేంద్రం రద్దు చేసింది. దీంతో ఇకపై 5,  8 తరగతుల విద్యార్థులను ఫెయిల్ చేసే అవకాశం ఉంది. అంటే తప్పనిసరిగా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఒక వేళ ఫెయిల్ అయితే రెండు నెలల వ్యవధిలో ఉపాధ్యాయుల చేత మంచిగా పాఠాలు నేర్పించి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. మళ్లీ ఫెయిల్ అయితే అదే తరగతిలో కూర్చోబెట్టాలి. అంతే తప్ప స్కూల్‌ నుంచి పంపించకూడదు.

సహజంగా తొమ్మిది తరగతి వరకు హాజరు కారణంగా పై తరగతులకు ప్రమోట్ అయిపోతుంటారు. కేవలం పబ్లిక్ ఎగ్జామ్‌లో మాత్రమే విద్యార్థుల ప్రతిభ బయటపడుతుంటుంది. కానీ ఇప్పుడైతే 5 నుంచి 8 తరగతుల విద్యార్థులు తప్పనిసరిగా ఎగ్జామ్స్‌లో మెరుగైన ప్రతిభ కనబర్చాల్సిందే. లేదంటే.. అదే తరగతిలో కూర్చోవల్సి ఉంటుంది. నో డిటెన్షన్ రద్దుతో విద్యార్థులకు కొత్త చిక్కులు వచ్చినట్లైంది.

2019లో విద్యాహక్కు చట్టానికి సవరణ చేసిన తర్వాత కనీసం 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే నో డిటెన్షన్ విధానం అమలవుతుంది. ఫెయిల్ విద్యార్థులకు రెండు నెలల్లో తిరిగి పరీక్షలు నిర్వహిస్తుంటారు. వారికి అదనపు కోచింగ్ ఇచ్చి మెరుగుపరుస్తుంటారు. పాస్ అయితే పై తరగతులకు ప్రమోట్ అవుతుంటారు. లేదంటే 5, 8 తరగతుల్లోనే కూర్చోబెడతారు. అయితే చదువు పూర్తయ్యే వరకు ఏ చిన్నారిని బహిష్కరించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ విధానం కేవలం కేంద్రీయ విద్యాలయాలు, నవోద్యాల విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలతో సహా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న 3,000 పాఠశాలలకు మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తిస్తుందని సీనియర్ విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.