Big Action Against Zakir Naik: జాకిర్ నాయక్‌కు భారీ షాక్.. IRFపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం!

Big Action Against Zakir Na

Big Action Against Zakir Na

Big Action Against Zakir Naik: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన పరారీలో ఉన్న మత బోధకుడు జాకిర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (IRF)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. దేశంలోని మత సామరస్యాన్ని దెబ్బతీయడం, సమాజంలో విద్వేషం, అసమ్మతిని ప్రోత్సహించడం వంటి కార్యకలాపాలకు IRF పాల్పడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ లౌకిక స్వరూపానికి విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది.

హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, జాకిర్ నాయక్, IRFకు చెందిన ఇతర సభ్యులు సమాజంలో విభేదాలు, విద్వేషాన్ని సృష్టించే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని కేంద్రం పేర్కొంది. జాకిర్ నాయక్ ప్రసంగాలు, ప్రకటనలు యువతను ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రేరేపించేలా ఉన్నాయని కూడా నోటిఫికేషన్‌లో ఆరోపించారు. వివిధ మత వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహిస్తూ, భారత్‌తో పాటు విదేశాల్లోని కొందరు యువతను ఉగ్రవాద చర్యలకు ప్రేరేపించే ప్రయత్నాలు చేశారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో IRFను తక్షణమే చట్టవిరుద్ధ సంస్థగా కొనసాగించడం అవసరమని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరో ఐదేళ్లపాటు నిషేధం

చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, 1967లోని సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను వినియోగించి IRFను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించింది. అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి మరో ఐదేళ్లపాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే UAPAలోని సంబంధిత నిబంధనల ప్రకారం న్యాయపరమైన ఉత్తర్వులకు ఈ నిర్ణయం లోబడి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

జాకిర్ నాయక్‌పై భారత్‌లో పలు కేసులు

జాకిర్ నాయక్‌పై భారత్‌లో విద్వేషపూరిత ప్రసంగాలు, మత సామరస్యానికి భంగం కలిగించడం వంటి ఆరోపణలతో పలు కేసులు నమోదయ్యాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కూడా ఆయనపై UAPAతో పాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసింది. జాకిర్ నాయక్ 2016 నుంచి మలేషియాలో నివసిస్తున్నాడు. ఆయనను భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో అప్పగింత (ఎక్స్‌ట్రడిషన్) ప్రక్రియను ప్రారంభించింది. అయితే భారత్ అభ్యర్థనపై మలేషియా ఇప్పటివరకు అనుకూల నిర్ణయం తీసుకోలేదు.

బంగ్లాదేశ్‌లోనూ జాకిర్ నాయక్‌పై వివాదం

జాకిర్ నాయక్ పేరు గతంలో బంగ్లాదేశ్‌లో కూడా వివాదాస్పదమైంది. 2016 జూలైలో జరిగిన ఢాకా హోలీ ఆర్టిసన్ బేకరీ ఉగ్రదాడి తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఆయన కార్యకలాపాలపై చర్యలు తీసుకుంది. జాకిర్ నాయక్‌కు చెందిన Peace TVతో పాటు సోషల్ మీడియా వేదికల ద్వారా ఆయన ప్రసంగాలు విస్తృతంగా ప్రజలకు చేరుకున్నాయి. ఈ వేదికల ద్వారా మత సామరస్యానికి భంగం కలిగించే అంశాలను ప్రచారం చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. IRFపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించడంతో జాకిర్ నాయక్ మరోసారి వార్తల్లో నిలిచారు. దేశ భద్రత, మత సామరస్యం, ఉగ్రవాద నిరోధక చర్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.