Site icon NTV Telugu

విజృంభిస్తోన్న కొత్త వేరియంట్… పది రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు

భారత్‌లో దక్షిణాఫ్రికా వేరియంట్‌ కేసులు…ఊహించని విధంగా పెరిగిపోతున్నాయ్. ఒమిక్రాన్‌ పాజిటివ్‌లు…450కి చేరువయ్యాయ్. రిస్క్ దేశాల నుంచే కాకుండా…నాన్‌ రిస్స్‌దేశాల నుంచి వచ్చిన వారిలోనూ ఒమిక్రాన్‌ బయటపడుతోంది. మరోవైపు పదిరాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది.

దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ నానాటికీ విస్తరిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాలకు ఈ వేరియంట్ పాకగా.. 450కి చేరువయ్యాయ్. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కొత్త వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీలో 79, గుజరాత్‌లో 43 కేసులు నమోదయ్యాయి. తాజాగా రాజస్థాన్‌లో ఒక్కరోజే 21 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 43కు పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 7వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు.

ఒమిక్రాన్‌, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయించింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, మిజోరం, కర్ణాటక, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌, పంజాబ్‌ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లనున్నాయి. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల్లో 3 నుంచి 5 రోజుల పాటు ఉండనున్నాయి. కొవిడ్‌ పరీక్షలు, కరోనా నిబంధనల అమలు వంటి అంశాలపై రాష్ట్ర అధికారులతో కలిసి పనిచేయనున్నాయి. దీంతో పాటు వ్యాక్సినేషన్‌ వృద్ధి, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యత తదితర అంశాలను పరిశీలించి కేంద్రానికి నివేదించనున్నాయ్.

వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా…వివిధ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అసోం ప్రభుత్వం…రాత్రి కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చింది. ప్రతిరోజూ రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అయితే నూతన సంవత్సర వేడుకలకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పటికే హర్యానా, యూపీ, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయ్.

Exit mobile version