Site icon NTV Telugu

All-Party Meeting: ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు జీ-20 సన్నాహక సమావేశం

Pm Modi

Pm Modi

నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా కీలక సమావేశం జరగనుంది.. భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఇది.. అంటే, జీ-20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచన కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలను సమావేశానికి ఆహ్వానించారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఈ సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన చీఫ్‌లు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ తదితరులు హాజరుకానున్నారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశానికి వెళ్లనున్నారు.. ఇక, బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఈ సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

భారతదేశం అధికారికంగా డిసెంబర్ 1న జీ20 ప్రెసిడెన్సీని స్వీకరించింది. జీ–20 శిఖరాగ్ర సదస్సుకి ముందు హైదరాబాద్ సహా దేశవ్యా ప్తంగా 200కిపైగా సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్రం.. మరోవైపు జీ–20 మొట్టమొదటి ప్రతినిధుల సదస్సు రాజస్థాన్లోని ఉదయపూర్‌లో ఆదివారం నిర్వహించారు.. సమ్మిళిత అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్య రంగంలో సదుపాయాలు, నాణ్యమైన జీవనం వంటివాటిపై భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ మాట్లాడారు. ఇక, దేశాధినేతలు లేదా ప్రభుత్వాల స్థాయిలో తదుపరి జీ20 లీడర్స్ సమ్మిట్ వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 మరియు 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ఇక, ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. అయితే తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కాకుండా తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ హోదాలో ఈ సమావేశంలో పాల్గొంటానని బెనర్జీ చెప్పారు. కాగా, ఇండోనేషియా ఈ నెల ప్రారంభంలో బాలి సమ్మిట్‌లో వచ్చే సంవత్సరానికి జీ 20 అధ్యక్ష పదవిని భారతదేశానికి అప్పగించింది, ఇది ప్రతి భారతీయ పౌరుడికి గర్వకారణమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. జీ 20 లేదా గ్రూప్ ఆఫ్ 20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఫోరమ్.

Exit mobile version