పశ్చిమ బెంగాల్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్‌షా కలయిక కారణంగా గంగూలీ బీజేపీలో చేరతారా అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే తన ఇంటికి వచ్చిన అమిత్ షాకు గంగూలీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఆ తర్వాత బీజేపీ నేతల సమక్షంలోనే పలు అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఆ తర్వాత గంగూలీ ఇంట్లోనే ఆయనతో కలిసి అమిత్ షా డిన్నర్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజానికి గంగూలీని బీజేపీలోకి తేవాలని ఆ పార్టీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. గత ఏడాది పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఆయనను పార్టీలోకి తేవాలని బీజేపీ ప్రయత్నించింది. బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే గంగూలీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో గంగూలీ బీజేపీలో చేరకపోవడంతో ఊహాగానాలకు చెక్ పడింది. కట్ చేస్తే అమిత్ షా తాజాగా గంగూలీ ఇంటికి వెళ్లడంతో మళ్లీ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. కాగా గంగూలీ, అమిత్ షాల తాజా భేటీకి కారణం ఉందని.. గంగూలీ భార్య డోనా గంగూలీ శుక్రవారం కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో నాట్యం చేయగా.. ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారని తెలుస్తోంది. అనంతరం డోనా గంగూలీ ఆహ్వానం మేరకు అమిత్ షా గంగూలీ నివాసానికి వెళ్లారని వార్తలు వస్తున్నాయి.
Union Home Minister Amit Shah met with BCCI chief Sourav Ganguly and had dinner with him at his residence in Kolkata, West Bengal pic.twitter.com/dCn3TkgsT1
— ANI (@ANI) May 6, 2022
