Central Government Jobs in 8 years: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. గడిచిన 8 ఏళ్లలో 7.22 లక్షల మందిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నామని వెల్లడించారు. 2014-2022 మధ్య ఈ రిక్రూట్మెంట్ జరిగినట్లు బుధవారం పార్లమెంట్ లో వెల్లడించారు. మొత్తం 7,22,311 మందిని వివిధ శాఖల్లోకి తీసుకున్నామని తెలిపారు.
వీరిలో 2021-22లో 38,850 మందిని, 2020-21లో 78,555 మందిని, 2019-20లో 1,47,096 మందిని, 2018-19లో 38,100 మందిని, 2017-18లో 76,147 మందిని, 2016-17లో 1,01,333 మందిని, 2015-16లో 1,11,807 మందిని, 2014-15లో 1,30,423 మందిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మొత్తం 22,05,99,238 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకుంటే 7.22 మందిని కేంద్ర కొలువుల్లోకి తీసుకున్నారు.
Read Also: Bhatti Vikramarka : బండి సంజయ్ ఉన్మాది.. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం
కేంద్రం ప్రభుత్వం ఉపాధి కల్పనకు అనేక చర్యలు తీసుకుంటుందని.. 2021-22 బడ్జెట్ నుంచి ప్రారంభం అయ్యే 5 ఏళ్లలో రూ. 1.97 లక్షల కోట్లతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్( పీఎల్ఐ) పథకాన్ని ప్రారంభించినట్లు జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ పథకం కింద 60 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. సూక్ష్మ , చిన్న వ్యాపార సంస్థలకు, వ్యక్తులు తమ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, విస్తరించడానికి వీలుగా రూ. 10 లక్షల వరకు ఎలాంటీ పూచికత్తు లేకుండా రుణాలను అందిస్తున్నామని అన్నారు.కోవిడ్ కారణంగా దెబ్బతిన్న వీధి వ్యాపారులను ఆదుకునేందుకు 2020 జూన్ 1 నుంచి ప్రధాన మంత్రి వీధి వ్యాపరుల ఆత్మనిర్మర్ నిధిని అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. పీఎం గతిశక్తి ద్వారా రానున్న రోజుల్లో సబ్కా ప్రయాస్ ద్వారా అందరికి భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు.
