Site icon NTV Telugu

Centre on Covid-19: కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో కరోనా కాలర్ ట్యూన్‌ బంద్

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత రెండేళ్లుగా దేశంలో టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన కాలర్ ట్యూన్‌లు ఎట్టకేలకు నిలిచిపోనున్నాయి. ఎప్పుడూ కాల్ చేసినా ‘కరోనాపై పోరాటంలో మనం పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో’ అంటూ వినిపించే కాలర్ ట్యూన్‌లతో ప్రజలు విసిగెత్తిపోయారు. ఈ కాలర్‌ట్యూన్ సెల్‌ఫోన్ వినియోగదారులకు పలు సందర్భాల్లో చికాకు కూడా తెప్పించేది. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో టెలికాం ఆపరేటర్లు ఈ కాలర్ ట్యూన్‌ను త్వరలో తొలగించనున్నారు.

ఈ కాలర్ ట్యూన్ కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్‌కాల్‌ మాట్లాడటం ఆలస్యమవుతోందని వినియోగదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 ప్రీ-కాల్ సందేశాలను తొలగించేందుకు పరిశీలన చూస్తోంది. ఈ సందేశాలను నిలిపివేయాలని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం లేఖ రాసింది. చాలా మంది వినియోగారులు అత్యవసరంగా కాల్ చేయాల్సిన సమయంలో కరోనా కాలర్‌ ట్యూన్‌ను డియాక్టివేట్ చేయడానికి టెలికాం ఆపరేటర్లను సంప్రదించేవారని.. ఆర్‌టీఐ ద్వారా అనేక ఫిర్యాదులను జోడించి ఈ కాలర్ ట్యూన్ తొలగించాలని అభ్యర్థించినట్లు లేఖలో పేర్కొంది. కాగా త్వరలోనే కరోనా కాలర్ ట్యూన్ తొలగించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పినట్లు తెలుస్తోంది.

https://ntvtelugu.com/amarnath-yatra-dates-are-confirmed-by-jammu-and-kashmir-government/
Exit mobile version