Site icon NTV Telugu

Covaxin: కొవాగ్జిన్ టీకాకు అనుమతిపై ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Covaxin

Covaxin

Covaxin: రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొవాగ్జిన్ టీకాకు వేగంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఆరోపణలు తప్పుదోవ పట్టించే అసత్య వార్తలు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ బయోటెక్ తన టీకా తయారీలో కొన్ని ప్రక్రియలను వదిలేసిందని.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా క్లినికిల్ పరీక్షలను వేగవంతం చేసిందని మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్రం వివరణ ఇచ్చింది. భారత ప్రభుత్వం, జాతీయ నియంత్రణ సంస్థ సీడీఎస్‌సీఓ కొవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే సమయంలో శాస్త్రీయ విధానాలను, సంబంధిత నిబంధనలను పాటించినట్లు స్పష్టం చేసింది.

కాగా టీకా పరిజ్ఞానంపై ఏ మాత్రం అవగాహన లేనివారే ఆరోపణలు చేస్తున్నారని భారత్ బయోటెక్ సంస్థ అసహనం వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అధ్యయనాలు జరిగిన టీకాల్లో కొవాగ్జిన్ ఒకటి అని.. దీనిపై 20 ప్రీ క్లినికల్ అధ్యయనాలు నిర్వహించామని తెలిపింది. మూడు ఛాలెంజ్ ట్రయల్స్, 9 హ్యూమన్ క్లినికల్ స్టడీస్ చేపట్టామని వివరించింది. కొందరు వ్యక్తులు, కొన్ని బృందాలు కావాలనే కొవాగ్జిన్ టీకాపై బురద జల్లుతున్నాయని భారత్ బయోటెక్ మండిపడింది. టీకా అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలనే ఒత్తిడి తమపై ఎప్పుడూ లేదని వివరించింది. వాస్తవానికి తామే అంతర్గతంగా కోవిడ్ మహమ్మారికి వేగంగా స్పందించామని భారత్ బయోటెక్ తెలిపింది. భద్రమైన, ప్రభావవంతమైన టీకా ఆవిష్కరించి ప్రజల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో పనిచేశామని పేర్కొంది.

Exit mobile version