ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఆమోదించింది. దేశీయంగా చమురు, సహజవాయువు నిల్వలను పెంచడంతో పాటు ఉత్పత్తిని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.84,084 కోట్ల వ్యయంతో రూపొందించిన ‘సముద్ర మంథన్–నేషనల్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ స్కీమ్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పత్తిని వేగవంతం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం ఇంధన అవసరాల కోసం విదేశీ దిగుమతులపై భారత్ అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో.. ఆ దిగుమతి ఆధారితతను తగ్గించి, దీర్ఘకాలిక ఇంధన భద్రతను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రధాని మోడీ 2025 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రకటించారు. దేశ సముద్ర జలాల్లో హైడ్రోకార్బన్ అన్వేషణను విస్తరించేందుకు ఇది కీలక అడుగుగా పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సముద్ర ప్రాంతాల్లో చమురు, సహజవాయువు అన్వేషణను మరింత విస్తృతం చేసి.. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు సాంకేతిక అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనలో కూడా ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
సముద్ర చమురు, సహజవాయువు అన్వేషణకు సంబంధించిన మొత్తం విలువ గొలుసులో ఈ పథకం కింద పలు కీలక కార్యక్రమాలు చేపట్టనున్నారు. అధిక నాణ్యత కలిగిన భూకంప సంబంధిత డేటాను పెద్ద ఎత్తున సేకరించడం, ప్రాసెసింగ్ చేయడం, విశ్లేషించడం ఇందులో భాగంగా ఉంటుంది. అలాగే లోతైన సముద్ర, అత్యంత లోతైన సముద్ర ప్రాంతాల్లోని బ్లాకుల్లో అన్వేషణ డ్రిల్లింగ్‌ను వేగవంతం చేయనున్నారు.
ఇప్పటివరకు పెద్దగా అన్వేషించని కొత్త సముద్ర బేసిన్‌లలో శాస్త్రీయ పద్ధతుల్లో డ్రిల్లింగ్ చేపట్టడం, సముద్ర చమురు ఉత్పత్తి కోసం ఉమ్మడి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి అయిన చమురు, గ్యాస్‌ను తీర ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం కూడా పథకంలో ఉన్నాయి. దీనితో పాటు సమగ్ర ఆయిల్ అండ్ గ్యాస్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ జోన్ను ఏర్పాటు చేయనున్నారు.
పథకం అమలు పర్యవేక్షణ కోసం డిజిటల్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు నైపుణ్యాభివృద్ధి, కొత్త సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం, సంబంధిత వర్గాల భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారానికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సముద్ర చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తికి అవసరమైన సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నారు.
‘సముద్ర మంథన్’ పథకం ద్వారా భారత్ హైడ్రోకార్బన్ నిల్వలకు 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు సమాన పరిమాణం (ఎంఎంటీఓఈ) కంటే ఎక్కువ నిల్వలు అదనంగా చేరే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. సముద్ర ప్రాంతాల్లో చమురు, సహజవాయువు అన్వేషణ కార్యకలాపాలు పెరగడంతో పాటు దేశీయ ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది.
ఈ పథకం ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. దేశీయ తయారీ రంగం అభివృద్ధి చెందడంతో పాటు సముద్ర చమురు, గ్యాస్ రంగానికి సంబంధించిన సాంకేతికతలు, సేవల్లో ప్రపంచ స్థాయిలో పోటీపడగల వ్యవస్థ ఏర్పడుతుందని పేర్కొంది.
చమురు, సహజవాయువు అన్వేషణ నుంచి ఉత్పత్తి వరకు ఉన్న మొత్తం విలువ గొలుసులో ఈ పథకం భారీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. దీని ద్వారా పరిశ్రమల అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని వెల్లడించింది.
అలాగే ప్రధానమంత్రి సూర్య సరోవర యోజన కోసం రూ. 5,070 కోట్ల రూపాయల కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కోసం రూ. 3,15,614 కోట్లు, నేషనల్ కే లో ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్కీం కోసం రూ.36,441 కోట్లు, సముద్ర మంథన్ కోసం రూ.84,084 కోట్లు, క్వీన్ ట్యూబ్ టన్నెల్స్ నిర్మాణం కోసం.. రూ.9,779 కోట్లు కేటాయించారు. ఇవాళ మొత్తం కేంద్ర కేబినెట్.. రూ.4,50, 988 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.

