NTV Telugu Site icon

Manipur Violence Cases: 53 మందితో సీబీఐ దర్యాప్తు బృందం.. 29 మంది మహిళా అధికారులు

Manipur

Manipur

Jammu Earthquake : మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రప్రభుత్వం సీబీఐతో విచారణకు ఆదేశించిన విషయం తెలిసింది. అందులో భాగంగా సీబీఐ బృందంలో 53 మంది సభ్యులను నియమించారు. వారిలో 29 మంది మహిళా అధికారులు ఉండటం విశేషం. సీబీఐ విచారణ బృందంలో ఇంత పెద్దమొత్తంలో మహిళా అధికారులు ఉండటం ఇదే మొదటిసారని.. గతంలో ఏ కమిటీ విచారణ సందర్భంగా కూడా ఇంత మంది మహిళా అధికారులు లేరని చెబుతున్నారు. మణిపూర్ అల్లర్లలో వెలుగుచూసిన లైంగిక హింస వీడియో కేసును సీబీఐకి కేంద్రం అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించడానికి సీబీఐ దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్ల నుంచి 53 మంది అధికారులను నియమించింది. అందులో 29 మంది మహిళా అధికారులు ఉన్నారు. ముగ్గురు డీఐజీలు లవ్లీ కతియార్‌, నిర్మలాదేవి, మోహిత్‌ గుప్తాతోపాటు ఒక ఎస్పీ రాజ్‌వీర్‌ సైతం ఉన్నారు. ఇద్దరు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, ఆరుగురు డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్‌లు సీబీఐ బృందంలో ఉన్నారు. మొత్తం దర్యాప్తును జాయింట్‌ డైరెక్టర్‌ ఘనశ్యామ్‌ ఉపాధ్యాయ్‌ లీడ్‌ చేయనున్నారు.

Read also: TS Govt : రాష్ట్రం లో 5500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే ఆలోచనలో వున్న ప్రభుత్వం..?

సీబీఐ విచారిస్తున్న ఈ కేసుల్లో చాలా వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989లోని నిబంధనలకు సంబంధించినవని, వాటిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి దర్యాప్తు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాంటి కేసుల్లో డీఎస్పీలు పర్యవేక్షకులుగా ఉండటం సాధ్యం కానందున దర్యాప్తును పర్యవేక్షించడానికి సీబీఐ ముగ్గురు డీఐజీలను ఒక ఎస్పీని నియమించినట్లు అధికారులు స్పష్టం చేశారు. సీబీఐ బృందంలో 16 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. సాధారణంగా ఇంత పెద్ద సంఖ్యలో కేసులను సీబీఐకి అప్పగించాల్సి వస్తే సిబ్బందిని సమకూర్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సంబంధిత రాష్ట్రంపై ఆధారపడి ఉంటుందని, కానీ మణిపూర్ విషయంలో దర్యాప్తులో పక్షపాత ఆరోపణలు రాకుండా స్థానిక అధికారుల పాత్రను తగ్గించడానికి సీబీఐ ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెప్పారు. విచారణ సందర్బంగా ఇరు వర్గాల వ్యక్తుల ప్రమేయం ఉండకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే సీబీఐ ఎనిమిది కేసులు నమోదు చేసింది. రెండు కేసుల్లో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుకు సంబంధించినవి కాగా.. మణిపూర్ హింసాకాండకు సంబంధించి మరో తొమ్మిది కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. దీంతో సంస్థ విచారించనున్న మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది.ఈ కేసులో కాకుండా మహిళలపై నేరాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన ఇతర కేసులను కూడా ప్రాధాన్యత ఆధారంగా విచారిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో చురచంద్‌పూర్ జిల్లాలో జరిగిన లైంగిక వేధింపుల కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Show comments