Site icon NTV Telugu

Mahua Moitra: క్యాష్ ఫర్ క్వేరీ కేసులో మహువా మోయిత్రాపై సీబీఐ విచారణ ప్రారంభం..

Mahua Moitra

Mahua Moitra

Mahua Moitra: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుంది టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరే వారితో పంచుకున్నట్లు వెల్లడైంది. దీనిపై ఇప్పటికే పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని సిఫారసు చేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలతోఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉంటే ఇటీవల లోక్‌పాల్ మహువా మోయిత్రాపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని ఆదేశించింది. ఈ మేరకు తాజాగా మహువాపై సీబీఐ విచారణ ప్రారంభమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విచారణ ఆధారంగా ఎంపీపై క్రిమినల్ కేసు పెట్టాలా..? వద్దా..? అనేది సీబీఐ నిర్ణయించనుంది. ప్రాథమిక విచారణలో సీబీఐ ఒక నిందితుడిని అరెస్ట్ చేయదు, కానీ సోదాలు నిర్వహించవచ్చు, సమాచారాన్ని కొరవచ్చు, పత్రాలను పరిశీలించవచ్చు దీంతో పాటు మహువా మోయిత్రాను ప్రశ్నించవచ్చు. లోక్‌పాల్ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించిన సీబీఐ, నివేదికను ఆ సంస్థకే ఇవ్వనుంది.

Read Also: Jaipur tinder murder Case: టిండర్‌లో పరిచయం, డేట్.. కట్ చేస్తే కిడ్నాప్, దారుణహత్య

పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ, అదానీ గ్రూపును టార్గెట్ చేస్తూ మహువా మోయిత్రా ప్రశ్నలు అడిగింది. దీని కోసం ఆమె వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు దర్శన్ హీరానందనీ పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్‌కి సమర్పించిన అఫిడవిట్‌లో డబ్బులు ఇచ్చినట్లు వెల్లడించారు. దీనిపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్ సభ స్పీకర్కి లేఖ రాశారు. ఆమె లాగిన్ వివరాలను ఇతర వ్యక్తులతో పంచుకుందని ఐటీ మినిష్టర్‌కి ఫిర్యాదు చేశారు.

అయితే మొదటి నుంచి ఈ వివాదానికి దూరంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఆ పార్టీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ దీనిపై ఇటీవల స్పందించారు. కావాలనే ప్లాన్ చేసి మహువాను పార్లమెంట్ నుంచి బహిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని, అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆమెకే ప్లస్ అవుతుందని, ఆమె విజయావకాశాలు మరింత మెరుగుపడుతాయని అన్నారు.

Exit mobile version