Site icon NTV Telugu

Rahul Gandhi: ‘‘భారత్ రాజ్యం’’పై నోరుజారిన రాహుల్ గాంధీ.. మరో కేసు నమోదు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మరోసారి నోరుజారారు. ఇటీవల కాంగ్రెస్ కొత్త కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘‘ భారత రాజ్యంపై పోరాటం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు మేము బీజేపీ, ఆర్ఎస్ఎస్, భారత రాజ్యంపై పోరాడుతున్నాము’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గౌహతిలోని పాన్ బజార్ పోలీస్ స్టేష్‌లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ని పొడిచింది బంగ్లాదేశ్ వ్యక్తి.. పోలీసులకు ఎలా చిక్కాడంటే..?

జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్‌లో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడే చర్యలు అని బీఎన్ఎస్ సెక్షన్లు 152, 197(1)d కింద FIR నమోదు చేయబడింది. మోంజిత్ చెటియా రాహుల్ గాంధీపై కేసు పెట్టారు. ఆయన వాక్ స్వేచ్ఛ హద్దులు దాటిందని, జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు దేశ అధికారాన్ని చట్టవిరుద్ధం చేయడానికి ప్రయత్నించాయని, అశాంతి, వేర్పాటువాద భావాలను రేకెత్తించే కథనాన్ని సృష్టిస్తున్నాయిన చెటియా ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘‘తన పోరాటం భారత రాజ్యంపై అంటూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటన చేయడం ద్వారా నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో విధ్వంస కార్యకలాపాలను, తిరుగుబాటును రెచ్చగొట్టాడు.’’ అని పేర్కొన్నారు. పదే పదే ఎన్నికల్లో ఓడిపోతూ నిరాశతో రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెటియా అన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన రాహుల్ గాంధీ, దీనికి బదులుగా అబద్ధాలను వ్యాప్తి చేయడానికి, తిరుగుబాటును రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. భారతదేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేశారని అన్నారు.

Exit mobile version