NTV Telugu Site icon

Puja khedkar: పూజా ఫ్యామిలీని వెంటాడుతున్న కష్టాలు.. తాజాగా తండ్రిపై ఎఫ్ఐఆర్

Pujakhedhkar

Pujakhedhkar

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఫ్యామిలీని కేసులు కష్టాలు వెంటాడుతున్నాయి. పూజా ఇప్పటికే ఉద్యోగాన్ని కోల్పోవడమే కాకుండా క్రిమినల్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉంది. వివాదాలు వెంటాడుతున్న సమయలోనే పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఓ అన్నదాతను తుపాకీతో బెదిరించిన కేసులో జైలుకెళ్లింది. ఇప్పుడు తండ్రి దిలీప్ ఖేద్కర్ వంతు వచ్చింది. పూణె కలెక్టరేట్‌లో విధి నిర్వహణలో ప్రభుత్వోద్యోగిని బెదిరించి.. పనులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై తహసీల్దార్ స్థాయి అధికారి బండ్‌గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో దిలీప్ ఖేద్కర్‌పై కేసు నమోదైంది. దిలీప్ ఖేద్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన పూజా ఖేద్కర్‌కు సొంత ప్రాంతం పూణెలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పోస్టింగ్ పడింది. ప్రొబేషనరీ సమయంలో రెండేళ్ల పాటు ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ పూజా తండ్రి దిలీప్ మాత్రం.. కలెక్టరేట్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ అధికారుల్ని బెదిరించి కుమార్తె‌కు సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆయనపై తాజాగా తహసీల్దార్‌ దీపక్‌ అకాడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెదిరింపుల సమయంలో దురుసుగా ప్రవర్తించారని.. అంతేకాకుండా పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేకపోయినప్పటికీ కూతురికి క్యాబిన్‌ కేటాయించాలని అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆ కేసులో దిలీప్ ఖేద్కర్‌ ముందస్తు బెయిల్‌కు అప్లై చేసుకోగా.. ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఇక ఆయన భార్య మనోరమ ఇటీవలే బెయిల్‌పై విడుదలైంది. దిలీప్ ఖేద్కర్ గత లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.60 కోట్లు ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవల పూజ ఖేద్కర్ ఎంపికను రద్దు చేసింది. భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షలు, ఎంపికల నుంచి ఆమెను శాశ్వతంగా డిబార్ చేసింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 కోసం ఆమె చేసిన దరఖాస్తులో సమాచారాన్ని తప్పుగా సూచించారని ఆరోపణలపై ఢిల్లీలో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా ఖేద్కర్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. దుబాయ్ పారిపోయినట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. మరోవైపు యూపీఎస్సీ చర్యను సవాల్ చేస్తూ పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లుగా తనకు ఎలాంటి కాపీ అందలేదని ఆమె న్యాయస్థానంలో తెలిపింది.