NTV Telugu Site icon

Madhya Pradesh: అన్నా చెల్లెల క్యారెక్టర్‌పై అనుమానం.. చెట్టుకు కట్టేసి అమానుషం..

Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. అన్నా చెల్లెలను చెట్టుకు కట్టేసి చావబాదారు గ్రామస్తులు. వీరిద్దరి క్యారెక్టర్లపై అనుమానం పెంచుకున్న గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ ఖాండ్వాలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. బాధితుడు తన సోదరి అయిన కళావతిని కలవడానికి బామండా గ్రామానికి వచ్చాడు. వీరిద్దరు పెరట్లో ఒకే మంచంపై కూర్చోని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో కళావతి భర్త కూడా ఇంట్లో లేడు. అయితే వీరిని ఇలా చూసిన కొందరు గ్రామస్తులు పుకార్లను పుట్టించి వీరిద్దరి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశారు.

Read Also: Ajit Pawar: ఇది పీఎం మోడీ మ్యాజిక్ కాకుంటే ఇంకేంటి..? ఎన్సీపీ నేత సంచలన వ్యాఖ్యలు..

దీంతో గ్రామస్తులంతా ఏకమై వారిని గ్రామంలోని ఓ చెట్టు కింద కూర్చోబెట్టి కర్రలతో చావబాదారు. ఈ ఘటనను అంతా సెల్ ఫోన్లతో వీడియో తీశారు. బాధితులు తాము ఇద్దరం బంధువులం అని, అన్నా చెల్లెల్లమని ఎంత చెప్పిన గ్రామస్తులు వినిపించుకోలేదు. చివరకు మహిళ భర్త కూడా వారిద్దరు బంధువులని ఫోన్ లో చెప్పాడు. అయితే ఈ ఘటనపై కొంతమంది వారి బంధువులకు సమాచారం ఇచ్చిన తర్వాత, వారు వచ్చే వరకు ఇద్దరిపై దాడి చేస్తూనే ఉన్నారని పిప్లోట్ పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వైరల్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఘటనకు కారణం అయిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Show comments