Jodha-Akbar: బ్రిటీష్ చరిత్రకారుల ప్రభావం కారణంగా భారతదేశ చరిత్రలో అనేక తప్పులు నమోదయ్యాయని రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ బగాడే అన్నారు. బుధవారం, ఉదయ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..జోధాబాయి, మొఘల్ పాలకుడు అక్బర్ చక్రవర్తి వివాహం వివాహం కూడా అబద్ధమే అని అన్నారు. అక్బర్‌నామా గ్రంథంలో ఎక్కడా కూడా వీరిద్దరికి పెళ్లి జరిగినట్లు ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
“జోధా మరియు అక్బర్ వివాహం చేసుకున్నారని, ఈ కథపై ఒక సినిమా కూడా తీశారని చెబుతారు. చరిత్ర పుస్తకాలు కూడా ఇదే చెబుతున్నాయి కానీ అది అబద్ధం” అని గవర్నర్ అన్నారు. భర్మల్ అనే రాజు ఉండేవారని, ఆయన తన పనిమనిషి కుమార్తెను అక్బర్‌తో వివాహం చేయించారని పేర్కొన్నారు. గవర్నర్ వ్యాఖ్యలతో 1569లో అమేర్ పాలకుడు భర్మల్ కుమార్తె జోధాబాయి, అక్బర్ మధ్య వివాహంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. అమెర్ లేదా అంబర్, ప్రస్తుతం జైపూర్ సమీపంలోని రాజ్‌పుత్ రాజ్యం. 1727లో సవాయి జై సింగ్-2 రాజధానిని జైపూర్‌కి మార్చడానికి ముందు కచ్వాహా రాజ్‌పుత్‌లో పాలించబడింది.
Read Also: Kannada Industry : క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ బ్యాన్ చేస్తాం.. కన్నడ ఇండస్ట్రీ వార్నింగ్
“బ్రిటిష్ వారు మన హీరోల చరిత్రను మార్చారు. వారు దానిని సరిగ్గా వ్రాయలేదు, వారి చరిత్ర వెర్షన్ మొదట్లో అంగీకరించబడింది. తరువాత, కొంతమంది భారతీయులు చరిత్ర రాశారు, కానీ అది ఇప్పటికీ బ్రిటిష్ వారిచే ప్రభావితమైంది” అని గవర్నర్ బగాడే అన్నారు. రాజ్‌పుత్ పాలకుడు మహారాణా ప్రతాప్ అక్బర్‌కి ఒక ఒప్పంద లేఖ రాశాడనే చరిత్రకారుల వాదనను కూడా ఆయన వ్యతిరేకించారు. ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే కథనం అన్నారు.
“మహారాణా ప్రతాప్ తన ఆత్మగౌరవంతో ఎప్పుడూ రాజీపడలేదు. చరిత్రలో ఎక్కువగా అక్బర్ గురించి బోధించారు. మహారాణా ప్రతాప్ గురించి తక్కువగా చెప్పారు” అని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడుతోందని, కొత్త జాతీయ విద్యా విధానంలో మన మన సంస్కృతిని, అద్భుతమైన చరిత్రను కాపాడుకుంటూ భవిష్యత్తు సవాళ్లకు కొత్త తరాన్ని సిద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గవర్నర్ అన్నారు. రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ మహరాజ్ లను దేశభక్తి చిహ్నాలుగా గవర్నర్ బగాడే ప్రశంసించారు.
