BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!

  • సెప్టెంబర్ 12, 13న ఢిల్లీలో 18వ BRICS సదస్సు
  • పుతిన్‌కు ఐటీసీ మౌర్య, జిన్‌పింగ్‌కు తాజ్ ప్యాలెస్ కేటాయింపు
  • ఢిల్లీలో 3,000కు పైగా హోటల్ రూమ్స్ బుకింగ్
  • కొన్ని లగ్జరీ హోటళ్లలో ఒక్క నైట్ ధర రూ.2 లక్షలకు పైగా
Brics

Brics

BRICS Summit: ఢిల్లీ మొత్తం కుట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగబోయే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో దేశ రాజధానిలోని లగ్జరీ హోటళ్లు అన్నీ హైసెక్యూరిటీ జోన్‌లోకి వెళ్లిపోయాయి. ప్రపంచ దేశాధినేతలు, దౌత్యవేత్తలు, వీవీఐపీలు వస్తుండటంతో సెక్యూరిటీ టైట్ చేశారు. ఇదిలా ఉంటే, ఢిల్లీలోని ప్రముఖ స్టార్ హోటళ్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో 3000కు పైగా హోటల్ గదులు బుక్ చేసినట్లు సమాచారొం. కొన్ని హోటళ్లలో ఒక్క నైట్ ఖర్చు రూ. 2 లక్షలు దాటింది.

జిన్‌పింగ్, పుతిన్ బస ఎక్కడ..?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడి షి జిన్‌పింగ్‌తో పాటు బ్రిక్స్ సభ్యదేశాలకు చెందిన దేశాధినేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. బ్రిక్స్‌లో మొత్తం 11 సభ్యదేశాలు ఉంటే, ఆయా దేశాధినేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. పుతిన్ ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో బస చేస్తున్నట్లు సమాచారం. జిన్ పింగ్ తాజ్ ప్యాలెస్‌లో బసచేస్తున్నట్లు తెలుస్తోంది.

ఓబెరాయ్‌లో ఇరాన్ అధ్యక్షుడు, విదేశీ ప్రతినిధి బృందాలు:

ది ఓబెరాయ్ న్యూఢిల్లీలో బ్రిక్స్ దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు బస చేస్తు్న్నాయి. బ్రెజిల్, కజకిస్తాన్, ఇథియోపియా, ఇండోనేషియా ప్రతినిధి బృందాలు ఇక్కడ ఉన్నట్లు సమాచారం. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా ఈ హోటల్‌లోనే బస చేస్తున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాలతో హోటల్ వద్ద పలు దశల్లో తనిఖీలు చేపడుతున్నారు. సాధారణ పర్యాటకులకు రూమ్‌లు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది.

తాజ్ మహల్ హోటల్‌కు విదేశీ ప్రతినిధుల తాకిడి:

ఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్‌కు ఉరుగ్వే, ఫిలిప్పీన్స్, క్యూబా, బెలారస్, వియత్నాం దేశాల ప్రతినిధి బృందాలు బస చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) డైరెక్టర్ జనరల్స్ కూడా ఈ హోటల్‌లో బస చేస్తున్నట్లు సమాచారం. ఈ హోటల్ కూడా ఇప్పటికే పూర్తిగా బుక్ అయినట్లు దాని అధికార వెబ్‌సైట్ చూపిస్తోంది.

లె మెరిడియన్‌లో యూఎన్ చీఫ్, ది లలిత్‌‌లో ఆఫ్రికా దేశాల ప్రతినిధులు:

ఢిల్లీలోని లె మెరిడియన్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ బస చేస్తున్నారు. ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షులు కూడా ఇదే హోటల్‌లో ఉన్నారు. ఉగాండా, నైజీరియా, మలేషియా ప్రతినిధి బృందాలు కూడా ఈ హోటల్‌లో బస చేస్తున్నాయి.

దక్షిణాఫ్రికా, బురుండి దేశాల ప్రతినిధి బృందాలు కన్నాట్ ప్లే్‌స్‌లోని ది లలిత్ న్యూఢిల్లీ హోటల్‌లో బస చేస్తున్నారు. ఆఫ్రికన్ దేశాలకు చెందిన ప్రతినిధులకు కూడా ఇదే హోటల్ కేటాయించినట్లు సమాచారం. షాంగ్రీలా ఈరోస్‌లో పశ్చిమాసియాకు చెందిన దేశాల ప్రతినిధులు ఉంటున్నారు.

బ్రిక్స్‌లో మొత్తం 11 సభ్యదేశాలు..

ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ ఉన్నాయి.సదస్సుకు హాజరయ్యే ప్రముఖ నేతల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ, ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తదితరులు ఉన్నారు. యూఏఈ తరఫున అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బ్రెజిల్ తరఫున విదేశాంగ మంత్రి మౌరో వియెరా హాజరుకానున్నారు.