BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు

Delhi Traffic Restrictions

Delhi Traffic Restrictions

BRICS Summit 2026: బ్రిక్స్‌ సమావేశాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ భద్రతా, ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఢిల్లీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దాదాపు 5 వేల మంది ట్రాఫిక్‌ పోలీసులు, 50 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. 35కి పైగా ప్రధాన రహదారులు, 22 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ డైవర్షన్లు అమలు చేయనున్నారు. బ్రిక్స్‌ సమావేశాలు భారత మండపంలో జరగనున్నప్పటికీ, నోయిడా, సెంట్రల్‌ ఢిల్లీ, ఈస్ట్‌ ఢిల్లీ, ద్వారక, దౌలా కువాన్‌ తదితర ప్రాంతాల్లో భారీగా ఆంక్షలు విధించారు. బ్రిక్స్‌ అతిథుల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్‌ కార్యాచరణ రూపొందించారు. విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఎయిర్‌పోర్టులకు వెళ్లేందుకు మెట్రోను వినియోగించాలని పోలీసులు సూచించారు. విమాన ప్రయాణికులు మూడు, నాలుగు గంటల ముందుగానే విమానాశ్రయాలకు చేరుకునేలా ప్రణాళిక చేసుకోవాలని తెలిపారు.

ఢిల్లీలో గగనతలంపై మూడు రోజుల ఆంక్షలు
బ్రిక్స్‌ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ గగనతలంపై కూడా ప్రత్యేక ఆంక్షలు విధించారు. నేటి ఉదయం 7 గంటల నుంచి సెప్టెంబర్‌ 13 ఆదివారం రాత్రి 11 గంటల వరకు ఇవి కొనసాగనున్నాయి. ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలోని అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నియంత్రణలు ఉంటాయి. ముందుగా నిర్ధారించిన సమయాలకు భిన్నంగా అన్‌షెడ్యూల్డ్‌ విమానాలను నడపడం నిషేధం. అయితే షెడ్యూల్డ్‌ విమానాలకు అనుమతి ఉంటుంది. ఇందుకు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC) నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి. భారత వైమానిక దళం, సరిహద్దు భద్రతా దళాలు, ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు ఈ ఆంక్షలు వర్తించవు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు ప్రయాణించే రాష్ట్ర ప్రభుత్వ విమానాలు, హెలికాప్టర్లకు కూడా అనుమతి ఉంటుంది.

ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరం దాటిన తర్వాత ప్రతి విమానం FL290 అంటే 29,000 అడుగుల ఎత్తుకు చేరుకోవాలి. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలోకి రాగానే ల్యాండింగ్‌ కోసం ఆ ఎత్తు నుంచి దిగడం ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ మూడు రోజుల పాటు పౌర విమానాల రాకపోకలకు సఫ్దర్‌జంగ్‌ విమానాశ్రయం మూసివేయనున్నారు. రక్షణ దళాలకు మాత్రమే అక్కడ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆంక్షలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలతో నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌ (NOTAM) జారీ చేశారు.