NTV Telugu Site icon

Uttarakhand tunnel rescue: రెస్క్యూ ఆపరేషన్‌కి బ్రేక్.. చెడిపోయిన డ్రిల్లింగ్ మిషన్‌..

Uttarakhand Tunnel Rescue

Uttarakhand Tunnel Rescue

Uttarakhand tunnel rescue: ఉత్తరాఖండ్ టన్నెల్ కూలిపోయిన ఘటనలో మరో ఇబ్బంది ఎదురైంది. మరికొంత కాలం సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిల్క్యారా సొరంగం కూలిన ప్రదేశంలో దేశంలోని నిపుణులతో పాటు విదేశీ నిపుణులు రెస్క్యూ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. శుక్రవారం నాటికి రెస్క్యూ కార్యక్రమాలు విజయవంతమవుతాయని అధికారులు భావిస్తున్నారు.

Read Also: Rani Rudrama: కేటీఆర్ను గద్దె దించి సిరిసిల్లలో నన్ను గెలిపించండి

ఇదిలా ఉంటే డ్రిల్లింగ్‌కి ఎంతో కీలకంగా ఉన్న ఆగర్ డ్రిల్లింగ్ మిషిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇప్పటి వరకు 46.8 మీటర్ల వరకు డ్రిల్లింగ్ పూర్తైంది. కార్మికులు సొరంగంలో 57 మీటర్ల లోపల ఉన్నారు. మరో 10 మీటర్లు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డ్రిక్స్ మాట్లాడుతూ.. కార్మికులకు మరికొన్ని మీటర్ల దూరంలో ఉన్నామని, వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఆగర్ మిషిన్ చెడిపోయిందని, దాన్ని సరి చేస్తున్నామని, తిరిగి రేపు పనిచేయాల్సి ఉందని, ఇప్పటి వరకు డ్రిల్లింగ్ మిషన్ మూడు సార్లు చెడిపోయినట్లు తెలిపారు.

కార్మికుల చికిత్స కోసం ఇప్పటికే ప్రమాదం జరిగిన స్థలంలో అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి, వీరికి చికిత్స అందించేందుకు 41 బెడ్లలో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. నవంబర్ 12న సిల్క్యారా సొరంగం కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఉత్తర కాశీ జిల్లాలో బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. గత 12 రోజులుగా కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయారు. వీరికి ఆహారం, మందుల్ని ఓ పైప్ ద్వారా అందిస్తున్నారు. కూలిన సమయంలో కరెంట్ సదుపాయాలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కార్మికులు ఉన్న చోట వెలుతురు ఉంది. వారంతా సురక్షితంగా తిరిగి రావాలని స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు దేవతలకు ప్రార్థనలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి బాధితులతో మాట్లాడారు. మేము మీకు మరికొంత దూరంలోనే ఉన్నామని చెప్పారు.