NTV Telugu Site icon

Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌కి బాంబు బెదిరింపు.. తీరా చూస్తే..

Train Bomb Threat Call

Train Bomb Threat Call

Bomb Call Triggers Panic in Delhi-Jammu Rajdhani Train Halted at Sonipat Station: అప్పుడప్పుడు కొందరు ఆకతాయిలు పోలీసులకు ఫోన్ చేసి.. బాంబ్ బెదిరింపు కాల్స్ చేస్తుంటారు. కేవలం తమ సరదా కోసం.. టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తారు. శుక్రవారం రాత్రి కూడా అదే జరిగింది. ఎవరు ఫోన్ చేశారో తెలీదు కానీ, ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి రైల్వే కంట్రోల్ రూమ్‌కి శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీ-జమ్మూతావి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందని చెప్పి, వెంటనే ఫోన్ కట్ చేశారు. దీంతో.. పోలీసులు వెంటనే అప్రమత్తమై, 9:35 గంటలలకు హర్యానాలోని సోనిపత్ వద్ద ఆ రైలుని ఆపేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైలును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Delhi Student Case: ఢిల్లీ స్టూడెంట్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. చంపింది ఎవరో తెలుసా?

తొలుత ఒక బృందం రాత్రి 11:40 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీ చేయగా.. కొంత సమయం తర్వాత రెండో బృందం కూడా వచ్చి శోధించింది. రాత్రి ఒంటిగంట వరకు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను సోనిపత్ పోలీస్ స్టేషన్‌లో నిలిపి.. రైలులోని ప్రతీ బోగీని ఖాళీ చేసి.. బాంబ్ కోసం క్షుణ్ణంగా వెతికారు. బాంబ్ ఎక్కడా దొరక్కపోవడంతో.. చివరికి అదో ఫేక్ కాల్ అని, ఎవరో బాంబ్ ఉందని తప్పుడు సమాచారం ఇచ్చారని గ్రహించి.. 1.30 గంటలకు రైలును జమ్మూకు పంపించారు. ఎవరో ఆకతాయి చేసిన పనికి.. దాదాపు మూడు గంటల పాటు గందరగోళ వాతావరణం నెలకొంది. సోనిపత్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్ రాకముందే.. ఆ రైల్వే స్టేషన్‌ను పోలీసు కంటోన్మెంట్‌గా మార్చారు. రైలులో తనిఖీ కొనసాగేంతవరకు.. GRP, RPF సిబ్బంది రైల్వే ట్రాక్‌కి ఇరువైపులా ఉన్నారు.

Food Inflation: కూరగాయల తర్వాత హడలెత్తిస్తున్న పండ్ల ధరలు.. ఆపిల్ ఉత్పత్తిలో 40శాతం తగ్గుదల

ఈ ఘటనపై ఉత్తర రైల్వే సీపీఆర్వో దీపక్ కుమార్ స్పందిస్తూ.. తాము రైలుని క్షుణ్ణంగా పరిశీలించామని, కానీ ఎక్కడా బాంబ్ ఆనవాళ్లు కనిపించలేదని అన్నారు. ఇది ఎవరో ఆకతాయి చేసిన పని అని, దీనిపై విచారణ జరిపి.. ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకుంటామని చెప్పారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామన్నారు. అతడు చేసిన ఫేక్ కాల్ కారణంగా.. టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. చాలామంది ప్రయాణికులు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను రెండు గంటలకు పైగా ఆపేశారంటూ ట్విటర్‌లో ఫిర్యాదులు కూడా చేశారు.