NTV Telugu Site icon

వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ భారత్‌లోనే త‌క్కువ‌..! స్ప‌ష్టం చేసిన నివేదిక‌

vaccine

క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. ఇప్పుడు ప్ర‌జ‌ల్లో వ్యాక్సిన్‌పై అవ‌గాహ‌న పెరిగినా.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చిన మొద‌ట్లో.. ఆది తీసుకోవ‌డానికి వెనుక‌డుగు వేసిన‌వారు ఎంద‌రో.. ఇప్ప‌టికీ చాలా మందిలో వ్యాక్సిన్ భ‌యం లేక‌పోలేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తున్నాయి.. మ‌ళ్లీ కోవిడ్ బారిన ప‌డుతున్నారు.. వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కొంద‌రు ప్రాణాలే కోల్పోయారు.. ఇలా అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.. అయితే, భార‌త్‌లో వ్యాక్సిన్ల‌తో వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగానే ఉన్నాయని స్ప‌ష్టం చేసింది అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ (ఏఈఎఫ్ఐ) నివేదిక‌.. వ్యాక్సినేష‌న్‌.. దానివ‌ల్ల క‌లుగుతోన్న దుష్పరిణామాలపై నివేదిక‌ను ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించింది ఏఈఎఫ్ఐ.

ఆ నివేదిక‌లో వ్యాక్సినేష‌న్‌తో వ‌చ్చిన సైడ్ ఎఫెక్ట్స్‌ను వివ‌రంగా పేర్కొంది అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్… భార‌త్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కేవలం 26 మందిలో మాత్రమే రక్త స్రావం, రక్తం గడ్డకట్టడం వంటి ప‌రిణామాలు జ‌రిగాయ‌ని తెలిపింది.. ఇక‌, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో అలాంటి కేసులేవీ గుర్తించలేదని స్ప‌ష్టం చేసింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టిన‌ట్టు కొన్ని వార్త‌లు రాగా.. అయితే అలాంటి కేసులు భారత్‌లో అతి స్వల్పమని పేర్కొంది ఏఈఎఫ్ఐ. ఇండియాలో ఇప్పటివరకు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 650,819 మందికి ఇస్తే.. వారిలో 700 మందిలో మాత్ర‌మే సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని తెలిపింది. ఇక‌, వాటిలో 498 కేసులపై లోతుగా అధ్యయనం చేయగా కేవలం 26 మందికి మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టిన‌ట్టు వివ‌రించింది.. మ‌రోవైపు.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న‌వారిలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టిన కేసులేవీ న‌మోదు కాలేద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే, వ్యాక్సిన్ అంటే.. మొద‌ట్లో అంద‌రిలో భ‌యాలే.. కానీ, క్ర‌మంగా అవి తొల‌గిపోయినా.. ఇంకా కొంత‌మందిని భ‌యం వెంటాడుతూనే ఉంది. మ‌రోవైపు.. వ్యాక్సిన్ కోసం ఇప్పుడు కోట్లాది మంది ఎదురుచూస్తున్నా.. కొర‌త వేధిస్తోంది.. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ల కొర‌త‌కు చెక్ పెట్టేందుకు ప్ర‌భుత్వం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.