Site icon NTV Telugu

Muslim Quota: ముస్లిం కోటా వివాదం.. ప్రధాని వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ఫైర్..

Siddaramaiah

Siddaramaiah

Muslim Quota: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇటీవల ఓ ప్రకటన చేసింది. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధమని, రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్లను ఒప్పుకోదని అన్నారు. ఇది బాబాసాహెబ్‌కి వెన్నుపోటు పొడవడమే అని కాంగ్రెస్‌ని నిందించారు. ముస్లింలకు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను ఇవ్వాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మంగళవారం రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఆరోపించారు. ఇప్పటికే సందపపునర్విభజన, వారతస్వ పన్ను వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడ్డ కాంగ్రెస్ పార్టీని ముస్లింకోటా ప్రతిపాదన మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.

ఇదిలా ఉంటే, కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రధాని మోడీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బీసీలు, దళితుల రిజర్వేషన్ కోటాను ముస్లింలకు బదిలీ చేస్తుందని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని అన్నారు. ‘‘ఇది అజ్ఞానం నుండి వచ్చింది. ఓటమి భయంతో నిరాశను చూపిస్తోంది. మన దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇంత తక్కువ స్థాయికి దిగజార్చలేదు’’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందున, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ బాధ్యతారాహిత్య ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించాలి లేదా జాతికి క్షమాపణ చెప్పాలి. ముస్లింలకు ఇవ్వడానికి వెనుకబడిన తరగతులు మరియు ఎస్సీ/ఎస్టీల రిజర్వేషన్లను తొలగిస్తామని కాంగ్రెస్ ఎక్కడ పేర్కొంది? కాంగ్రెస్ హయాంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది?’’ అని ప్రశ్నించారు.

Read Also: Horlicks: హార్లిక్స్ ఇక ‘‘హెల్త్ డ్రింక్’’ కాదు.. ఏం జరిగింది..?

‘‘రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను ఏకపక్షంగా సవరించలేమని, సామాజిక మరియు ఆర్థిక సర్వేల నివేదికల ఆధారంగా మాత్రమే రిజర్వేషన్లకు సవరణలు చేయవచ్చు. అంతేకాకుండా, షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలకు రిజర్వేషన్లను సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. అలాంటి సవరణలకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం అవసరం. వాస్తవం ప్రధానమంత్రికి ఈ ప్రాథమిక జ్ఞానం కూడా లేకపోవడం మన దేశానికి నిజంగా విషాదకరం’’ అని సిద్ధరామయ్య అన్నారు.

కర్ణాటకలో ముస్లింలను వెనబడిన తరగతులకు 2బీ కేటగిరీలో చేర్చడం ద్వారా వారికి రిజర్వేషన్లు కల్పించామని సిద్ధరామయ్య అన్నారు. ఇది ఇప్పుడు చేసింది కాదని, 1974లో ఎజీ హవనూరులో వెనకబడిన తరగతుల కమిషన్ నివేదిక ఆధారంగా రూపొందించబడిందని, ఈ రిజర్వేషన్లు గత మూడు దశాబ్ధాలుగా అమలులో ఉన్నాయని, గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను ప్రశ్నించలేదని, కోర్టులో సవాల్ చేయలేదని ఆయన అన్నారు.

ముస్లింకోటాపై నిన్న ప్రధాని మాట్లాడుతూ..2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు ఇచ్చిందని, దేశవ్యాప్తంగా దీనిని అవలంభించాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆయన అన్నారు. 2004-10 మధ్య కాలంలో కాంగ్రెస్ ఏపీలో ముస్లిం రిజర్వేషన్లను అమలు చేయడానికి నాలుగు సార్లు యత్నించిందని, సుప్రీంకోర్టు దీనిని అడ్డుకుందని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ముస్లిం కోటాను రద్దు చేసినట్లు మోడీ గుర్తు చేశారు.

Exit mobile version