Odisha Train Accident: ఒడిషా రైలు ప్రమాదంలో నిర్లక్ష్యంగా వ్యవహారించిన అధికారులపై రైల్వే శాఖ వేటు వేసింది. తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారించడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని.. వేలాది మంది గాయపడ్డారని పేర్కొంటూ.. ఏడు మందిపై రైల్వే శాఖ వేటు వేసింది. ఏడు మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఏడుగురు ఉద్యోగులను రైల్వేశాఖ తొలగించింది. వీరిలో ముగ్గురు ప్రస్తుతం సీబీఐ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు ఎస్‌ఎండ్‌టీ అధికారులు కూడా ఉన్నారని ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అనీల్‌కుమార్ మిశ్రా తెలిపారు. వారితోపాటు ప్రమాదానికి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన సిబ్బందిగా గుర్తించిన బహనాగా బజార్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, మెయింటైనర్లను సస్పెండు చేసినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 294మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 1,100 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.
Read also: Pilot Rohith Reddy: పైలట్ రోహిత్ రెడ్డి మహా యాగంలో అపశ్రుతి.. అగ్నికి ఆహుతైన మండపం
బహనాగా బజార్, బాలాసోర్ రైల్వే స్టేషన్లను సౌత్‌ఈస్ట్ రైల్వే జీఎం, డీఆర్‌ఎం బుధవారం ప్రత్యక్షంగా సందర్శించారు. అనంతరం సిబ్బందికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టారు. ఈ అధికారులు బాలాసోర్ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగితో కలిసి గోపీనాథ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను కూడా సందర్శించారు. బాలాసోర్–నీలగిరి సెక్షన్‌ను కూడా పర్యవేక్షించారు. సీబీఐ అరెస్ట్ చేసిన ముగ్గురు రైల్వే ఉద్యోగులు సీనియర్ సెక్షన్ ఇంజినీర్(సిగ్నల్), అరుణ్‌కుమార్ మహంత, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్‌ఖాన్, టెక్నీషియన్ పప్పుకుమార్ లను మరో 4 రోజులపాటు రిమాండ్‌కు కొనసాగించనున్నారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి లభించింది. రైలు ప్రమాదంపై ఆగ్నేయ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్‌ఎస్) సమర్పించిన విచారణ నివేదిక బహనాగా బజార్ స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదానికి సిగ్నలింగ్ సమస్యలతో సహా అనేక మానవ లోపాలను ఎత్తి చూపింది. దీని ఆధారంగా రైల్వేశాఖ అధికారులు.. బాధ్యులుగా భావిస్తున్న వారిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. సీఆర్‌ఎస్ విచారణ పట్ల పలు రాజకీయ పక్షాలు విశ్వసనీయత ప్రదర్శించిన విషయం తెలిసిందే. రైలు దుర్ఘటనల్లో ఈ వర్గం విచారణ అత్యంత పారదర్శకతతో అనుబంధ లోటుపాటులను పటిష్టంగా ఖరారు చేయగలుగుతుందని పలు వర్గాల్లో నమ్మకం బలపడింది.
Read also: Shivathmika Rajashekar : కిల్లింగ్ పోజులతో రెచ్చగొడుతున్న శివాత్మిక..
సీబీఐ విచారణ నేరపరమైన ప్రమేయాన్ని వెలికి తీయగలుగుతుంది. రైల్వే శాఖా పరమైన అంశాలను రైల్వే భద్రతా కమిషనర్ విచారణ తేటతెల్లం చేస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ విచారణ పూర్తయి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక దాఖలు చేయడం పూర్తయ్యింది. సీఆర్‌ఎస్ విచారణ మానవ తప్పిదపరమైన లోపాలు ఘోర దుర్ఘటనను ప్రేరేపించాయని స్పష్టం చేసింది.ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అనీల్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ప్రమాదానికి దారితీసిన కారణాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు చేస్తోందని.. ఈ వర్గం నివేదిక కోసం వేచి ఉన్నామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు రైల్వే ఉద్యోగులకు వ్యతిరేకంగా శాఖాపరంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వారు విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉంటే ప్రమాద నివారణ సాధ్యమయ్యేదని భావిస్తున్నట్లు తెలిపారు.