గత మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజున భారతావని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా) సమీపంలో కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందనే వార్తలు జాతీయ మీడియాలో ఫ్లాష్ న్యూస్‌గా ప్రసారమవుతున్నాయి. ఇది చూసిన సైనికుల కుటుంబాలలో ఏదో తెలియని భయం.. ఆ భయంతోనే భారత సైనికదళంలో ఉన్న తమతమ వారికి ఫోన్ చేసి తమ వారు ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. అందులో కొందరు తమ వారు ఆ బాంబు దాడిలో మరణించారని తెలియడంతో ఆ సైనికుల కుటుంబాల రోదన వర్ణనాతీతం. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు అప్పడే తమను విడిచి వెళ్లాడా.. అని గుండెలు అవిసేలా రోదనలు ఓవైపు.. పుట్టినగడ్డ రుణం తీర్చుకున్నాడనే గర్వం మరోవైపు ఆ సైనికుడి వృద్ధతల్లిదండ్రులను స్పృశిస్తూ వెళుతున్నాయి.
మరోచోట.. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తానంటూ.. తన చిన్నారి కూతురుకు మాట ఇచ్చి వెళ్లిన తండ్రి.. ఉగ్రదాడిలో అసువులు బాసిన వార్త విని.. త్వరగా వస్తానన్న నాన్న ఎప్పడొస్తాడమ్మా.. అని ఆడుగుతున్న ఆ పాపకు సమాధానం ఇవ్వలేక ఓ తల్లి గుండెకోత.. ఇలా ఒక్కటేమిటి ఉగ్రదాడిలో మరణించిన 40 మంది సీఆర్‌పీఎఫ్ కుటుంబాల పరిస్థితి చూసిన ఏ ఒక్కరూ కన్నీరు పెట్టకమానరు. ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా 3 సంవత్సరాలు. ఆనాటి సైనికుల ప్రాణత్యాగాలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఫిబ్రవరి 14ను బ్లాక్ డే ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసి అమరులైన వీరసైనికులకు భారతదేశం అశ్రునయనాలతో నివాళులు అర్పిస్తోంది. ఎన్నటికీ పుల్వామా ఉగ్రదాడిలో భరతమాత ఒడిలో చేరిన సైనికుల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. తమ రక్తంతో భరతమాత నుదిటిన తిలకం దిద్దిన అమరవీరులకు ‘ఎన్టీవీ’ తరుఫున జోహర్లు..
