మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై బీజేపీ వేటు వేసింది. ఆరేళ్ళపాటు ఆమెను పార్టీ నుంచి బహష్కరిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఆమెలాగే ట్విటర్ మాధ్యమంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నవీన్ కుమార్ జిందాల్‌ని కూడా సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. బీజేపీ ఈ చర్యలకు పూనుకుంది.
ఓ టీవీ డిబేట్‌లో నుపుర్ శర్మ మాట్లాడుతూ.. ఓ వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసింది. దీంతో, ఆ మత వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వాళ్ళు స్థానిక మార్కెట్‌ను మూసివేసేందుకు ప్రయత్నించగా, మరో వర్గం వారిని అడ్డుకుంది. తద్వారా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో 40 మంది పౌరులతో పాటు 20 మంది పోలీసులు గాయపడ్డారు. బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ అల్లర్లు జరిగాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన అనంతరం ఆ ఇద్దరిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు వెల్లడించింది.
‘‘సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతదేశంలో ప్రతి మతమూ వర్ధిల్లుతోంది. అన్ని మతాల్ని బీజేపీ ఎప్పటికీ గౌరవిస్తుంది. మతపరమైన వ్యక్తుల్ని ఎవరైనా కించపరిస్తే, బీజేపీ సహించదు. అలాంటి వ్యక్తుల్ని పార్టీ ఎన్నటికీ ప్రోత్సహించదు’’ అని బీజేపీ ఆ ప్రకటనలో పేర్కొంది. భారతీయ పౌరులు ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడ్డానికి తాము కట్టుబడి ఉంటామని బీజేపీ తెలిపింది. అటు.. తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటున్నానని, శివుడిని కించపరిచే విధంగా పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నందుకే ప్రతిస్పందనగా ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని నుపుర్ శర్మ వివరణ ఇచ్చింది.