Site icon NTV Telugu

UP Polls 2022: యోగీకి బిగ్‌షాక్‌.. ఎస్పీలో చేరిన బీజేపీ ఎంపీ కుమారుడు..

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు తుది దశకు చేరుకున్న సమయంలో అధికార బీజేపీకి గ‌ట్టి షాక్‌ తగిలింది. భారతీయ జనతా పార్టీ ఎంపీ రీటా బ‌హుగుణ జోషి కుమారుడు మ‌యంక్‌.. ఈ రోజు సమాజ్‌వాది పార్టీలో చేరారు.. ఆజంఘ‌ఢ్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గోపాల్‌పూర్‌లో ఎస్పీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్‌ ప్రచారం నిర్వహించగా.. ఆ ప్రచార సభా వేదికగా మయంక్‌.. ఎస్పీ కండువా కప్పుకున్నారు. కాగా, ల‌క్నో నుంచి బీజేపీ టికెట్ కోసం మ‌యంక్ చేసిన ప్రయ‌త్నాలు విఫలం అయ్యాయి.. దీంతో, అలకబూనిన ఆయన.. ఇవాళ ఎస్పీ గూటికి చేరారు..

Read Also: Rahul Gandhi: ఎన్నికల ఆఫర్‌ ముగిసింది.. పెట్రోల్‌ ఫుల్‌ ట్యాంక్‌ చేసుకోండి..!

అయితే, గత నెల రోజుల నుంచే మయంక్‌.. ఎస్పీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది.. కానీ, త‌న కుమారుడు పార్టీని వీడ‌తార‌నే ప్రచారం నిరాధార‌మ‌ని అప్పట్లో ప్రయాగ్ రాజ్ ఎంపీ రీటా బహుగుణ జోషి చెబుతూ వచ్చినా.. ఇవాళ మాత్రం ఆయన ఎస్పీ కండువా కప్పుకోవడం చర్చగా మారింది. ఇక, బ్రాహ్మణ సామాజికవ‌ర్గంలో ప్రాబ‌ల్యం క‌లిగిన రీటా బహుగుణ జోషి కుమారుడు మ‌యంక్ జోషి.. ఎస్పీలో చేర‌డం కాషాయ పార్టీకి ఎదురుదెబ్బగా చెబతున్నారు రాజకీయ విశ్లేషకులు.

Exit mobile version