NTV Telugu Site icon

బీజేపీ మ‌హిళా ఎంపీ కారుపై రాడ్లు, రాళ్ల‌తో దాడి..

Ranjeeta Koli

భార‌తీయ జ‌నా పార్టీకి చెందిన మ‌హిళా ఎంపీ కారుపై గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ఒక్క‌సారిగా రాళ్లు, రాడ్ల‌తో విరిచుకుప‌డ్డారు.. ఊహించ‌ని ప‌రిణామంతో భ‌యాందోళ‌న‌కు గురైన ఆమె.. సొమ్మ‌సిల్లిప‌డిపోయారు.. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లో క‌ల‌క‌లం సృష్టించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. భరత్‌పూర్ ఎంపీ రంజీతా కోలీ.. త రాత్రి ధర్సోనీ గ్రామంలో ఓ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్లారు.. తిరిగి రాత్రి 11.30 గంటల సమయంలో భరత్‌పూర్ జిల్లాలోని ధర్నోనీకి వెళ్తుండగా ఐదుగురు గుర్తుతెలియ‌ని వ్యక్తులు రాళ్లు, ఐరన్ రాడ్లతో.. కారుపై దాడికి పాల్ప‌డ్డారు.. కారుపై రాళ్లు విసిరారు. ఇనుప రాడ్లతో కారు అద్దాలను పగలగొట్టారు. దీంతో.. భయపడిపోయిన ఎంపీ సొమ్మసిల్లిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో కారులో ఉన్నవారికి స్వ‌ల్ప గాయాలు అయిన‌ట్టుగా చెబుతున్నారు.. వెంట‌నే ఎంపీతో పాటు.. గాయ‌ప‌డిన‌వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.. చికిత్స అనంతరం అంద‌రినీ డిశ్చార్జ్ చేసిన‌ట్టు వైద్యులు తెలిపారు. ఇక‌, త‌న కారుపై రాత్రి 11.30 గంటల సమయంలో ఐదారుగురు దుండ‌గులు దాడిచేశారని ఎంపీ రంజీతా కోలి వెల్ల‌డించారు. ఎవ‌రిపై త‌న‌కు కోపం లేద‌ని.. ఈ ఘటనపై పోలీసులు విచార‌ణ జ‌రుపుతార‌ని ఆమె అన్నారు. భరత్‌పూర్ ఆమె తొలి ఎంపీ కాగా.. ఆమె మామగారు గంగారామ్ కోలి బయానా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ప‌నిచేశారు.. గ‌త కొంత‌కాలంగా రాజ‌స్థాన్‌లోని కాంగ్రెస్ స‌ర్కార్‌పై ఆమె ఆరోప‌ణ‌లు చేశారు.. ఈ దాడికి, ఆ వ్య‌ఖ్య‌ల‌కు ఏదైనా లింక్ ఉందా? అనే కోణంలోనూ పోలీసుల విచార‌ణ కొన‌సాగుతోంది.