NTV Telugu Site icon

Taj Mahal: మా స్థలంలోనే తాజ్‌ మహల్‌ కట్టారు..

Diya Kumari

Diya Kumari

తాజ్‌ మహల్‌ కట్టింది మా స్థలంలోనే అంటున్నారు బీజేపీ ఎంపీ దియా కుమారి.. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెబుతున్నారు.. దీంతో, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైనా తాజ్‌ మహల్‌.. మరోసారి వార్తల్లో నిలిచినట్టు అయ్యింది.. బీజేపీ ఎంపీ మరియు జైపూర్ మాజీ యువరాణి అయిన దియా కుమారి.. తాజ్ మహల్ నిర్మించిన భూమి వాస్తవానికి మా కుటుంబానికి చెందినదని పేర్కొన్నారు. జైపూర్ రాజకుటుంబం భూమిపై దావా వేసినట్లు తన వద్ద పత్రాలు ఉన్నాయని స్పష్టం చేశారు.. హిందూ విగ్రహాల ఉనికిని తనిఖీ చేయడానికి తాజ్ మహల్‌లోని 22 తాళం వేసిన గదులను పరిశీలించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని కోరుతూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దియా కుమారి ఈ వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపారు.

పిటిషన్‌కు మద్దతుగా ఎంపీ దియా కుమారి మాట్లాడుతూ.. స్మారక చిహ్నం నిర్మించడానికి ముందు అక్కడ ఏమి ఉందో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘మక్బరా’కు ముందు అసలు ఏముందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్న ఆమె.. మా కుటుంబం వద్ద రికార్డులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే వీటిని అందజేస్తామని తెలిపారు. మొఘల్ పాలకుడు షాజహాన్ తన కుటుంబానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకున్నాడన్న ఆమె.. ఆ కాలంలో న్యాయ వ్యవస్థ, అప్పీల్‌ చేసుకునే అవకాశం లేదనే విషయం అందరికీ తెలుసని. ఒకవేళ తమ దగ్గరున్న రికార్డులను పరిశీలిస్తే.. విషయం ఏంటో స్పష్టంగా తెలుస్తుందన్నారు.

కాగా, తాజ్ మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ కోసం సమాధిగా నిర్మించాడు. 1631లో నిర్మాణాన్ని ప్రారంభించారు.. ఈ పాలరాతి స్మారక చిహ్నం నిర్మాణానికి 22 సంవత్సరాలు పట్టింది.. 22,000 మంది కార్మికులు 1653లో తాజ్‌ మహల్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అయితే, షాజహాన్ తన భార్య సమాధిగా మార్చుకున్న ప్రాంతంలో శివాలయం ఉండేదని కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.. చాలా కాలంగా మూతపడిన తాజ్‌మహల్‌లోని 22 గదులను తెరిచేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) సర్వే చేయించాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు.. అయోధ్యలోని బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ రజనీష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌లో, సమాధి నిజానికి పాత శివాలయం అని కొంతమంది చరిత్రకారులు, హిందూ సంఘాల వాదనలను ఉదహరించారు. తాళం వేసి ఉన్న గదులను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి నివేదికను ప్రజలకు అందించాలని ఏఎస్‌ఐని పిటిషన్‌లో కోరారు.

అయితే, తాజ్‌మహల్‌ను దేవాలయంగా మార్చడం కాదు.. కానీ, సామాజిక సామరస్యానికి సంబంధించిన వాస్తవాన్ని బయటకు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు రజనీష్‌ సింగ్.. ఇలాంటి వివాదాలకు తెరపడాలంటే మూసి ఉన్న తలుపులను పరిశీలించడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. తాజ్ మహల్ పై ఇప్పటికే వెలుగులో ఉన్న వివాదాల ప్రకారం.. 1965లో, చరిత్రకారుడు పీఎన్‌ ఓక్ తన పుస్తకంలో తాజ్ మహల్ నిజానికి ఒక శివాలయం అని పేర్కొన్నాడు. 2015లో తాజ్ మహల్‌ను ‘తేజోమహలే’గా ప్రకటించాలని ఆగ్రాలోని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక, తాజ్ మహల్‌ను తేజోమహల్‌గా ప్రకటించాలని 2017లో బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ దియా కుమారి చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది తాజ్‌ మహల్‌.