NTV Telugu Site icon

Bansuri Swaraj: న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్‌ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్‌ నియామకం

Bansuri Swaraj

Bansuri Swaraj

Bansuri Swaraj న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ బాన్సురి స్వరాజ్‌కు హోం మంత్రిత్వ శాఖ కీలకమైన బాధ్యతలను అప్పగించింది. న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) సభ్యురాలిగా బాన్సురి స్వరాజ్‌ను నియమించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను హోం మంత్రిత్వ శాఖ జులై 3న విడుదల చేసింది. ఆ తర్వాత బుధవారం నాడు ఎన్‌డీఎంసీ సభ్యురాలిగా బాన్సురి స్వరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. బాన్సురి స్వరాజ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో తన పోస్ట్‌ను కూడా పంచుకున్నారు. ఎన్‌డీఎంసీ చైర్మన్‌గా ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సతీష్ ఉపాధ్యాయ పాల్గొన్నారు. బాన్సురి స్వరాజ్‌ 2024 లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి ఆప్‌కి చెందిన సోమనాథ్ భారతిపై పోటీ చేశారు. బాన్సురి స్వరాజ్ కంటే ముందు న్యూఢిల్లీ స్థానం బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖి వద్ద ఉండేది.

బాన్సురీ స్వరాజ్ ఎవరు?
బన్సూరి స్వరాజ్ మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె. ఆమె తండ్రి పేరు స్వరాజ్ కౌశల్, వృత్తిరీత్యా న్యాయవాది. స్వరాజ్ కౌశల్ మిజోరాం మాజీ గవర్నర్‌గా కూడా ఉన్నారు. బాన్సురీ స్వరాజ్ ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. ఆమె జనవరి 3, 1984న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బాన్సురి స్వరాజ్ 2007లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో నమోదు చేసుకున్నారు. ఆమె గత కొన్నేళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఆమె క్రిమినల్ లాయర్‌గా విధులు నిర్వర్తించారు. వార్విక్ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో బీఏ(ఆనర్స్), ఆమె ప్రతిష్టాత్మకమైన బీపీపీ లా స్కూల్, లండన్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఆ తర్వాత న్యాయవాదిగా అర్హత సాధించారు. దీని తర్వాత బాన్సురి స్వరాజ్ సెయింట్ క్యాథరిన్స్ కళాశాల, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ స్టడీస్ పూర్తి చేశారు.

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ లీగల్ టీమ్‌లో సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురీ స్వరాజ్ భాగం కావడంతో బాన్సురి మీడియా దృష్టిని ఆకర్షించారు. లలిత్ మోదీ తన న్యాయ బృందానికి ట్వీట్‌లో అభినందనలు తెలిపారు. లలిత్ మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్న లీగల్ టీమ్‌లో సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురితో పాటు మరో 8 మంది న్యాయవాదులు ఉన్నారు.