NTV Telugu Site icon

Bill Gates tribute to Ratan Tata: ‘‘ప్రపంచానికి నష్టం’’.. రతన్ టాటాకి బిల్‌గేట్స్ నివాళి..

Bill Gates Tribute To Ratan Tata

Bill Gates Tribute To Ratan Tata

Bill Gates tribute to Ratan Tata: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ‘‘జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం భారతదేశంపై, ప్రపంచంపై చెరగని ముద్రవేసింది’’ అని లింక్డ్‌ఇన్ పోస్టులో అన్నారు. తాను రతన్ టాటాని అనేక సందర్భాల్లో కలుసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా ఉద్దేశ్యం, మానవాళికి చేసే సేవ నన్ను ఎప్పుడూ కదిలించాయని అన్నారు. అనేక కార్యక్రమాల్లో టాటాతో కలిసి పనిచేయడాన్ని గుర్తు చేసుకున్నారు. అతడి వారసత్వం భవిష్యత్ తరాలకు స్పూర్తినిస్తుందని చెప్పారు.

Read Also: Mohammed Siraj: డీఎస్పీగా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరణ..

“రతన్ టాటా ఒక దార్శనిక నాయకుడు, జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం భారతదేశం మరియు ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. నేను అనేక సందర్భాల్లో అతనిని కలిసే అవకాశం దక్కింది. అతని ఉద్దేశ్యం మరియు మానవాళికి సేవ చేయాలనే బలమైన భావనతో నన్ను ఎల్లప్పుడూ కదిలించాయి’’ అని రతన్ టాటాతో ఉన్న ఫోటోని బిల్ గేట్స్ పోస్ట్ చేశారు. రతన్ టాటా మృతి రాబోయే కాలంలో ప్రపంచంపై ప్రభావం చూపిస్తుంది, అయితే అతను వదిలివెళ్లిన వారసత్వం, అతను సెట్ చేసిన మార్గదర్శకాలు తదుపరి తరాలకు స్పూర్తినిస్తాయని అన్నారు.

గత ఏడాది మార్చిలో రతన్ టాటాని బిల్ గేట్స్ అతని భారత పర్యటన సందర్భంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఇరువురు దాతృత్వం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఆరోగ్యం, రోగనిర్ధారణ, పోషకాహారం వంటి అంశాలపై భాగస్వామ్యం గురించి చర్చించారు. భారత పారిశ్రామిక దిగ్గజమైన రతన్ టాటా 86 ఏళ్ల వయసులో ముంబైలో కన్నుమూశారు. అతడి మృతిపై రాజకీయ నాయకుల దగ్గర నుంచి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల వరకు అందర్ని శోకసంద్రంలో ముంచింది. భారత ప్రజలు ఒక రత్నాన్ని కోల్పోయామని సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.