Bilkis Bano Case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రే*ప్ కేసు.. 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!

Bilkis Bano Case

Bilkis Bano Case

Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. వారికి విధించిన జీవిత ఖైదు శిక్షను సస్పెండ్ చేస్తూ, బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించడం, వారిలో ఒకరు తీవ్ర వైకల్యంతో బాధపడుతుండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 28న ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన ఇద్దరు దోషులను విపిన్‌చంద్ర కన్హయ్యాలాల్ జోషి, ప్రదీప్ రామన్‌లాల్ మోధియా‌గా గుర్తించారు. వీరిద్దరూ ఈ కేసులో దోషులుగా తేలిన 11 మందిలో ఉన్నారు. వీరికి గతంలో కల్పించిన ముందస్తు విడుదలను సుప్రీంకోర్టు 2024 జనవరిలో రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు దోషులు దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు.. వారు ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. అలాగే వారిలో ఒకరు తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న అంశాన్ని కూడా పరిశీలించింది. ఈ నేపథ్యంలో వారి జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. అయితే, వారి దోష నిర్ధారణకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీళ్లపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా దోషుల తరఫు న్యాయవాదులు కీలక వాదనలు వినిపించారు. వారిలో ఒకరి పేరు మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో లేదని, ఘటన జరిగిన సుమారు మూడేళ్ల తర్వాత అతడిని నిందితుడిగా చేర్చారని కోర్టుకు తెలిపారు. మరోవైపు, దోషులకు బెయిల్ మంజూరు చేయడాన్ని గుజరాత్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. అప్పీళ్లలో వాస్తవాలు, చట్టపరమైన అంశాలను మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.

ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. వారు పాటించాల్సిన బెయిల్ షరతులను సంబంధిత ట్రయల్ కోర్టు నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. అదే సమయంలో వారి దోష నిర్ధారణను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేయడం మరోసారి ఈ కేసును దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది.