Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర

  • వైరల్‌గా బీహార్ యువకుడి 12 జ్యోతిర్లింగాల యాత్ర..
  • తల్లి ఆరోగ్యం బాగుపడటంతో యాత్ర మొదలు పెట్టిన మోనూ..
  • ఇప్పటికే 6 క్షేత్రాలను దర్శనం, రోజుకు 50 కి.మీ పరుగు..
Monu Meturbala

Monu Meturbala

Bihar: తల్లి కోసం ఓ యువకుడు చేస్తున్న ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. తల్లి అనారోగ్యం నుంచి కోలుకోవాలని దేవుడిని ప్రార్థించిన యువకుడు, ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలను పరిగెత్తుకుంటూ దర్శిస్తున్నాడు. అనారోగ్యం నుంచి తల్లి కోలుకున్న తర్వాత, ఆ మొక్కును తీర్చుకునేందుకు తన యాత్ర ప్రారంభించాడు. బీహార్‌కు చెందిన 19 ఏళ్ల మోను మెటుర్బాలా ఇప్పటివరకు సుమారు 8,000 కిలోమీటర్లు ప్రయాణించి ఆరు జ్యోతిర్లింగాలను దర్శించాడు.

మోనూ 2026 మార్చి 15న పాట్నా నుంచి తన యాత్ర ప్రారంభించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న అతను రోజుకు సుమారు 50 కిలోమీటర్లు పరిగెత్తాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మిగిలిన 6 జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తర్వాతే ఇంటికి వెళ్తానని సంకల్పం తీసుకున్నాడు.

తల్లి అనారోగ్యంతో మొక్కు..

మోనూ తల్లి లల్తీ దేవీ గొంతులో చేప ముల్లు ఇరుక్కోవడంతో ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. కుటుంబ సభ్యులు పలు చోట్ల చికిత్స చేయించినప్పటికీ ఆమె ఆరోగ్యం నయం కాలేదు. అలాంటి సమయంలో, కొడుకు మోనూ ఆ పరమశివుడిని ప్రార్థిస్తూ, తల్లి ఆరోగ్యం బాగుపడితే జ్యోతిర్లింగాలు దర్శిస్తానని మొక్కుకున్నాడు. కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసేందుకు మోనూ పానీపూరీ విక్రయిస్తున్నాడు. అతడి తండ్రి మహేశ్ చౌహాన్, అన్న సోను ఇద్దరూ ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, యాత్రకు బయలుదేరే ముందు కుటుంబం ఎంతోకొంత సాయం చేశారు.

6 జ్యోతిర్లింగాల యాత్ర పూర్తి..

మోనూ తన మొక్కులో భాగంగా జార్ఖండ్‌లోని బాబా బైద్యనాథ్ ధామ్ నుంచి తన యాత్ర ప్రారంభించాడు. ఇప్పటి వరకు ఆరు క్షేత్రాలను దర్శించుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ యాత్రలో మరో ఇద్దరు యువకులు కూడా అతడితో జతకట్టారు. వారు మోనూకు తోడుగా ఉంటూ సహాయం చేస్తున్నట్లు వారు చెప్పారు. తన కుమారుడు మొక్కును నిలబెట్టుకుంటున్నందుకు గర్వంగా ఉందని తల్లి లల్తీ దేవి చెబుతున్నారు. యాత్రను విజయవంతంగా పూర్తి చేసి, కుమారుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.