Site icon NTV Telugu

12 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి.. బతికే ఉన్నాడని అందిన సమాచారం

బీహార్‌లో 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ తాజాగా తెలిసింది. అతడు పాకిస్థాన్ జైలులో బందీగా ఉన్నట్లు సమాచారం అందడంతో సదరు వ్యక్తి కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… బీహార్‌లోని బక్సర్‌ జిల్లా ఖిలాఫత్‌పూర్‌కు చెందిన ఛావీ అనే వ్యక్తి 12 ఏళ్ల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో అతడి వయసు 18 సంవత్సరాలు. అంతేకాదు అతడి మానసిక స్థితి కూడా సరిగా లేదు. అయితే అతడి కోసం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా… ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో చనిపోయాడని భావించి కర్మకాండలు కూడా నిర్వహించారు.

Read Also: వీడెవడండీ బాబూ… మహిళ అండర్‌వేర్‌ను మాస్క్‌గా పెట్టుకున్న వ్యక్తి

కట్ చేస్తే… తాజాగా ఛావీ బతికే ఉన్నాడని కుటుంబసభ్యులకు స్పెషల్ బ్రాంచీ పోలీసుల నుంచి ఓ లేఖ అందింది. అతడు పాకిస్థాన్ జైలులో బందీగా ఉన్నాడని సదరు లేఖలో పోలీసులు పేర్కొనడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చనిపోయాడనుకున్న కుమారుడు బతికే ఉన్నాడని తెలియడంతో ఛావీ కుటుంసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఛావీ పాకిస్థాన్‌లో ఏ జైలులో ఉన్నాడనే విషయంపై కచ్చితమైన సమాచారం అందాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మతిస్థిమితం లేకపోవడం వల్ల ఛావీ సరిహద్దు దాటి పాకిస్థాన్ బలగాలకు చిక్కి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతడి ఆచూకీని వీలైనంత త్వరగా కనుక్కుని భారత్‌కు తిరిగి రప్పిస్తామని కుటుంబసభ్యులకు పోలీసులు హామీ ఇచ్చారు.

Exit mobile version