బీహార్‌లోని జముయి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. బీహార్ డీజీపీ నుంచి నివేదిక కోరింది. అలాగే సోషల్ మీడియా నుంచి వీడియో తొలగించాలని ఆదేశించింది.
మహిళా కమిషన్ సుమోటోగా..
బీహార్‌లోని జముయి జిల్లాలో బాలికపై లైంగిక వేధింపుల ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ కేసులో తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులందరినీ గుర్తించి అరెస్టు చేయాలని, నిష్పక్షపాత విచారణ జరిగేలా చూడాలని కోరుతూ కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి లేఖ రాశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వీడియోను మరింతగా షేర్ చేయకుండా నిరోధించడానికి, బాధితులకు రక్షణ, న్యాయ సహాయం, మానసిక కౌన్సెలింగ్ మరియు అవసరమైన చట్టపరమైన చర్యలు అందించాలని కమిషన్ ఆదేశించింది. ఏడు రోజుల్లోగా వివరణాత్మక కార్యాచరణ నివేదిక (ATR)ను సమర్పించాలని ఛైర్‌పర్సన్ కూడా కోరారు.
ఇక బీహార్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ అప్సరా.. ఈ విషయంపై తాను జముయి జిల్లా మేజిస్ట్రేట్‌తో మాట్లాడినట్లు తెలిపారు. సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం లఖిసరాయ్-జముయి సరిహద్దు సమీపంలో ఈ సంఘటన జరిగిందని జిల్లా మేజిస్ట్రేట్ ఆమెకు తెలియజేశారు. ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించి, ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కేసులో తీసుకున్న చర్యల వివరాలను సోమవారం సాయంత్రంలోగా అందిస్తామని జిల్లా మేజిస్ట్రేట్ తనకు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. ఈ విషయంపై తాను జముయి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు కూడా ఒక లేఖ పంపి.. ఈ ఘటనపై తదుపరి చర్యల గురించి విచారిస్తానని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ తెలిపారు. వైరల్ వీడియో, బాధితురాలి వాంగ్మూలం, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
అసలేం జరిగిందంటే..
జమూయ్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు శనివారం సాయంత్రం ట్యూషన్ క్లాస్ ముగించుకుని బాలిక, బాలుడు స్కూటర్‌పై ఇంటికి బయల్దేరారు. జమూయ్-లఖిసరాయ్ రహదారిపై కొందరు యువకులు.. బాలికను అడ్డుకుని టార్చర్ చేయడం మొదలు పెట్టారు. ఈ పరిణామంతో బాలిక హడలెత్తిపోయింది. ఫ్లీజ్.. వదిలేయండి అంటూ బాధితురాలు వేడుకుంది. అయినా కూడా మృగాళ్ల మనసు కరగలేదు. పదే పదే బాలికపై చేతులు వేస్తూ వేధిస్తూ కనిపించారు. కొందరు బాలుడి చొక్కా కాలర్ పట్టుకుని లాగుతుంటే.. ఇంకొందరు బాలికను దూరంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాలిక తప్పించుకునేందుకు ప్రయత్నించగా ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి వెంబడిస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. శనివారం సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మొత్తానికి బాలుడు చెర నుంచి తప్పించుకుని బాలిక దగ్గరకు చేరుకున్నాడు. అనంతరం సమీపంలోని స్కూటర్ దగ్గరకు చేరుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా మళ్లీ నిందితులు వెంబడిస్తూ కనిపించారు. దీంతో బాలిక మరోసారి బతిమాలింది. వదిలేయండి అని వేడుకుంది. అంతటితో వీడియో ముగిసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ట్యాగ్ చేస్తున్నారు.
ఇక వీడియో ఆధారంగా జమూయ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత విద్యార్థుల నుంచి వివరాలు సేకరించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లుగా జమూయ్ ఎస్పీ విశ్వజిత్ దయాళ్ తెలిపారు.

