Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది

  • జముయి లైంగిక వేధింపుల కేసులో షాకింగ్ ఘటన
  • కోర్టులో నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
  • ప్రధాన నిందితుడి తండ్రిపై క్రిమినల్ కేసు నమోదు
Bihar

Bihar

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీహార్‌లోని జముయి లైంగిక వేధింపుల కేసులో నిందితుడు హరేరామ్ యాదవ్‌ను కోర్టులో హాజరుపరిచినప్పడు షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం దగ్గర ఓ న్యాయవాది చెంప పగలగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

నివేదికల ప్రకారం.. కోర్టులో హాజరైన సమయంలో న్యాయవాది ఆకాష్ పాండే.. నిందితుడు హరేరామ్ యాదవ్‌పై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతర న్యాయవాదులు కూడా దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు నిందితుడిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఇక ఈ కేసులో పోలీస్ ఎన్‌కౌంటర్ తర్వాత అరెస్టైన ప్రధాన నిందితుడు నందన్ యాదవ్ తండ్రి గనోరి యాదవ్‌పై 23 ఏళ్ల నాటి జంట హత్యల కేసులో క్రిమినల్ కేసు నమోదు చేశారు. 2003లో ప్రతాప్‌పూర్ గ్రామంలో ఇద్దరు సోదరుల హత్య కేసులో గనోరి యాదవ్ నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడిని ప్రతాప్‌పూర్ గ్రామంలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించారు. పోలీసుల కథనం ప్రకారం.. 2003 ఏప్రిల్ 3న టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్‌పూర్ గ్రామంలో కాంట్రాక్టు వివాదం కారణంగా డీపీ యాదవ్, పూణే యాదవ్‌లు హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత మృతుల తల్లి సంసారీ దేవి.. గనోరి యాదవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు.

సెప్టెంబర్ 19న మద్వా గ్రామంలో 10వ తరగతి విద్యార్థినిపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.