Bihar Election 2025: బీహార్ ఎన్నికలకు మరో ఐదు రోజులు మాత్రమే సమయంలో ఉంది. 243 సీట్లకు రెండు విడుతలుగా నవంబర్ 6, 11న ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న వెలువడుతాయి. ఈ ఎన్నికలు అధికార బీజేపీ+జేడీయూల ఎన్డీయే కూటమికి, ప్రతిపక్ష మహాఘటబంధన్ లోని ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్షాల కూటమికి ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే అనుకుంటుంటే, ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని ఆర్జేడీ కూటమి భావిస్తోంది.
అయితే, తాజాగా వెలువడిని బీహార్ ఒపీనియన్ పోల్‌లో హోరాహోరీ పోటీ తప్పదని తేలింది. రెండు కూటముల మధ్య టఫ్ ఫైల్ ఉన్నప్పటికీ, ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం వస్తుందని జేవీసీ పోల్ అంచనా వేసింది. ఎన్డీయే కూటమికి 120 నుంచి 140 సీట్లు వచ్చే అవకాశం ఉందని, మహాఘటబంధన్ కూటమికి 93-112 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. రెండు కూటముల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని చెప్పింది.
Read Also: Nitish Kumar: ‘‘నా కుటుంబం కోసం ఏం చేయలేదు’’.. ఎన్నికల ముందు నితీష్ కుమార్ వీడియో మెసేజ్..
243 సీట్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో బీజేపీ 70 నుంచి 81 సీట్లు గెలుచుకుంటుందని, జేడీయూ 42 నుంచి 48 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఎల్జేపీ(రామ్ విలాస్) 5 నుంచి 7 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని, హెచ్ఏఎం(ఎస్) 2 సీట్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది.
ప్రతిపక్ష మహాఘటబంధన్ కూటమిలో ఆర్జేడీ 69 నుంచి 78 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 9-17 సీట్లు గెలుచుకుంటుందని, సీపీఐ(ఎంఎల్), సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి 14 నుంచి 17 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ కేవలం ఒక స్థానానికి పరిమితమవుతుందని సర్వే చెప్పింది.
ఓట్ల శాతంలో ఎన్డీయే ముందంజలో ఉంది. ఓట్ల వాటా పరంగా చూస్తే, ఎన్డీయేకు 41% నుండి 43% వరకు పొందుతుందని, ఆర్జేడీ+ కాంగ్రెస్ మహాఘటబంధన్ కూటమికి 39% నుండి 41% ఓట్లు వస్తాయని, జన్ సురాజ్ పార్టీ 6% నుండి 7% వరకు పొందుతుందని ఒపీనియన్ పోల్ చెప్పింది.
