Site icon NTV Telugu

Nitish Kumar: ఎన్నికల ముందు నితీష్ వరాలు.. 125 యూనిట్ల విద్యుత్ బిల్లు కట్టొద్దని ప్రకటన

Nitishkumar

Nitishkumar

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రెండు, మూడు నెలల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఓటర్ల లిస్ట్ తుది జాబితాను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జాబితాను ప్రకటించగానే రెండు, మూడు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేయనుంది. ఇక అన్ని పార్టీలు ఎన్నికల చదరంగంలోకి దిగేశాయి. ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇక జేడీయూ నేతృత్వంలోని అధికార పార్టీ ప్రజలపై వర్గాల జల్లు కురిపించింది.

ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: టేకాఫ్‌ ముందు ఇంధన స్విచ్‌లు బాగానే ఉన్నాయి.. అంతలోనే ఎలా ఆగాయి? దీనిపైనే ప్రత్యేక ఫోకస్‌..!

మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందుబాటు ధరల్లోనే విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని… ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఈ పథకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. జులై బిల్లులను ఎవరూ కట్టనక్కర్లేదని చెప్పారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని నితీశ్ కుమార్‌ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Iran: అమెరికా, ఇజ్రాయెల్‌కు ఖమేనీ వార్నింగ్.. ఈసారి కాలు దువ్వితే..!

ఇక రానున్న మూడేళ్లలో గృహ వినియోగదారులందరి మద్దతుతో ప్రతి ఇంటిపై సోలార్‌ పవర్‌ ప్లాంట్లను అమర్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. కుటీర్‌ జ్యోతి పథకం కింద.. అత్యంత పేద కుటుంబాలకు సోలార్‌ ప్లాంట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సోలార్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని నితీశ్ హామీ ఇచ్చారు. తాజాగా విద్యుత్ హామీతో మరింత దూసుకుపోతున్నారు.

ఇక ప్రతిపక్ష నాయకుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ కూడా ఆర్జేడీ అధికారంలోకి వస్తే ‘మై బహిన్ సమ్మాన్ యోజన’ కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు రూ.2,500 హామీ ఇచ్చారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ లేదా నవంబర్‌లో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సంఘం బీహార్‌లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. విదేశీ ఓటర్లను కనుగొనేందుకు ఈ డ్రైవ్ చేపట్టింది. ఆగస్టులో ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.

 

Exit mobile version