ముడా భూమి స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు కోరుతూ ఓ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. లోకాయుక్త పోలీసుల దర్యాప్తు స్వతంత్రంగా ఉందని పేర్కొంది. ముడా ఇళ్ల స్థలాల కేసును సీబీఐకి అప్పగించాలని సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది.
లోకాయుక్త పోలీసులు ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయడం లేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుందని కార్యకర్త స్నేహమయి కృష్ణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా సీఎం తరపు న్యాయవాది కపిల్ సిబల్ అన్ని కేసులను సీబీఐకి అప్పగించాలనడం సరికాదని కోర్టుకు తెలిపారు. 2021లో సిద్ధరామయ్య కుటుంబానికి మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ఇచ్చిన భూమి గ్రాంట్లపై సిబిఐ దర్యాప్తు జరపాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై జనవరి 27న హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ముడా కేసును సీబీఐకి బదిలీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.