Bhojshala Case: మధ్యప్రదేశ్ ధార్ నగరంలో ఉన్న భోజ్‌శాల ఒక ఆలయం అంటూ ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా దశాబ్ధాలుగా కొనసాగుతున్న భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు వివాదానికి తెరపడింది. ఇది ఒక సరస్వతీ ఆలయం అని, దీనికి ఆధారంగా శాస్త్రీయ ఆధారాలను, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) రిపోర్టును కోర్టు ప్రస్తావించింది. ఈ తీర్పుతో హిందువులకు ఆలయంలో పూజ చేసుకునే హక్కు సంక్రమించింది.
Read Also: Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
ఇదిలా ఉంటే, తీర్పుపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ఆ ప్రదేశంలో ఎలాంటి ఆలయ ఆనవాళ్లు లభించలేదని ఏఎస్ఐ పేర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏఎస్ఐ సంరక్షణలో ఉన్న ఈ చారిత్రక కట్టడం ‘‘పూజా స్థలం’’ కాదు అని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు అస్పష్టంగా ఉందని అన్నారు.
దీనికి విరుద్ధంగా, భోజ్ ఉత్సవ్ సమితి సభ్యుడైన అశోక్ కుమార్ జైన్, భోజ్‌శాల-కమల్ మౌలా సముదాయాన్ని దేవాలయంగా ప్రకటించిన మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును స్వాగతించారు. కోర్టు నిర్ణయం తమ “సుదీర్ఘ పోరాటానికి” నిదర్శనమని అన్నారు. దిగ్విజయ్ సింగ్ సీఎంగా ఉన్న సమయంలోనే ఈ ప్రదేశంలో హిందువులు పూజలు చేయకుండా ఆంక్షలు విధించారని ఆరోపించారు. తమపై ఆంక్షలు విధించి, ముస్లింలు నమాజ్ చేసుకునే హక్కును ఇచ్చారని అన్నారు.
