కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే భావోద్వేగానికి గురయ్యారు. తమ పార్టీకి చెందిన నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. వారిని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘ఆ ఫోన్ మళ్లీ మోగాలని మాత్రమే కోరుకుంటున్నా’ అంటూ తన మనసులోని బాధను వెల్లడించారు.
అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లు జైలులో ఉండి సోమవారానికి ఆరో రోజుకు చేరుకున్న సందర్భంగా అభిజీత్ దీప్కే ఈ పోస్టు చేశారు. గత మూడు నెలలుగా పార్టీని నిర్మించడంలో, నిర్వహించడంలో వారిద్దరూ కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. ‘మీరిద్దరూ జైలులో ఉండి నేటికి ఆరో రోజు. నా సోదరుల్లాంటి మిమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను’ అంటూ తన భావాలను పంచుకున్నారు. సాధారణంగా కాక్రోచ్ జనతా పార్టీకి తానే ప్రధాన ముఖంగా కనిపించినప్పటికీ, సంస్థను నడిపించడంలో, ఐక్యంగా ఉంచడంలో అశుతోష్, సౌరవ్లు కీలకంగా వ్యవహరించారని దీప్కే పేర్కొన్నారు. ‘మీరిద్దరూ లేకపోతే CJP సాధించిన విజయాల్లో కనీసం సగం కూడా సాధించేది కాదని నేను నిజంగా భావిస్తున్నా’ అని తెలిపారు. పార్టీ కోసం వారు చేసిన త్యాగాలు, ఉద్యమానికి అందించిన సేవల గురించి మరింత మందికి తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
‘మీ కుటుంబాలకు క్షమాపణలు’
వారిద్దరూ జైలులో ఉండటంతో వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న బాధ, ఆందోళన, అనిశ్చితి తనను కలచివేస్తున్నాయని అభిజీత్ దీప్కే అన్నారు. ఈ పరిస్థితికి సంబంధించి అశుతోష్, సౌరవ్లతో పాటు వారి కుటుంబాలకు క్షమాపణలు కూడా చెప్పారు. ‘ఆ ఫోన్ మళ్లీ మోగాలని మాత్రమే కోరుకుంటున్నా’ అంటూ వారి నుంచి తిరిగి ఫోన్ కాల్ రావాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘నా సోదరులారా.. త్వరగా తిరిగి రండి’ అంటూ భావోద్వేగంగా తన పోస్టును ముగించారు.
అసలేం జరిగింది?
జంతర్ మంతర్ దగ్గర విధించిన ఆంక్షలను ఉల్లంఘించి నిరసన ప్రదేశంలోకి ప్రవేశించడంతో పాటు, తాళం వేసి ఉన్న గేటు ఎక్కారనే ఆరోపణల నేపథ్యంలో అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వారిద్దరినీ ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. అయితే వారు కస్టడీలో ఆరో రోజుకు చేరుకున్నట్లు అభిజీత్ దీప్కే తన పోస్టులో పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ CJP నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.

