NTV Telugu Site icon

Bengaluru Rains: బెంగళూర్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం.. ఎల్లో అలర్ట్ జారీ..

Bengaluru Rains

Bengaluru Rains

Bengaluru Rains: బెంగళూర్ నగరాన్ని మరోసారి వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రానున్న ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు, ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. “ఎల్లో అలర్ట్” జారీ చేసింది. బెంగళూర్ తో పాటు కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి, విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5 రోజుల్లో దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

Read Also: Siddharth: తారక్, మహేష్.. మధ్యలో సిద్దార్థ్ ఎవడు.. వీడేం చేస్తున్నాడు అంటారు

మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురువడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. హెబ్బాల, ఆర్టీ నగర్, ఎంజీ రోడ్డు, జయమహల్, శివాజీ నగర్, కేఆర్ సర్కిల్, విధానసౌధ, మెజెస్టిక్, కేఆర్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం బెంగళూర్, పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘాలతో కమ్ముకొని ఉంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నగరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

బెంగళూర్, బెంగళూర్ గ్రామీణ ప్రాంతాలు, రామనగర, తుమకూరు, చామరాజనగర, కోలార్, చిక్ మంగళూర్, హసన్, కొడుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పది రోజలు క్రితం ఇలాగే బెంగళూర్ ను వర్షాలు ముంచెత్తాయి. హఠాత్తుగా భారీ వర్షం కురవడంతో నగరంలోని రోడ్డు అస్తవ్యస్తంగా మారాయి. అండర్ పాసుల్లో నీరు చేరింది. కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్ద నీరు నిలవడంతో ఏపీకి చెందిన ఆరుగురు ప్రయాణిస్తున్న కారు నీటిలో చిక్కుకుపోయింది. ఈ ఘటనలో ఒక యువతి మరణించగా.. ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు.