Site icon NTV Telugu

Bengaluru Hotels Shutdown: హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ నిలిపివేత.. రేపు హోటల్స్‌ బంద్‌కు పిలుపు

Bengaluru Hotels Shutdown

Bengaluru Hotels Shutdown

Bengaluru Hotels Shutdown: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా గ్యాస్ ధరలపై ప్రభావం పడుతోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇజ్రాయెల్–అమెరికా మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనివల్ల దేశీయంగా ఇంధన ధరలపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో హోటల్ యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాను కొన్ని గ్యాస్ కంపెనీలు నిలిపివేయడంతో బెంగుళూరు హోటల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్ల నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని అసోసియేషన్ పేర్కొంది.

Read Also: Phosphorus Bomb Explained: ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న ఫాస్ఫరస్ బాంబు ఏమిటి?.. దీంతో అనర్థాలు ఏంటి..?

బెంగుళూరులో సుమారు 35 వేలకుపైగా చిన్నా పెద్దా హోటళ్లు ఉన్నాయి. అయితే నిన్నటి నుంచి చాలా హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో ఆహార తయారీ పూర్తిగా ప్రభావితమైంది. దీంతో హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బెంగుళూరు హోటల్ అసోసియేషన్ రేపు హోటళ్లు బంద్ చేయాలని పిలుపునిచ్చింది. కమర్షియల్ గ్యాస్ అందకపోతే హోటళ్లను నిర్వహించడం అసాధ్యమవుతుందని వారు తెలిపారు. అందువల్ల గ్యాస్ సరఫరా పునరుద్ధరించే వరకు చాలా హోటళ్లు తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని అసోసియేషన్ పేర్కొంది. అయితే గ్యాస్ సరఫరాను వెంటనే పునఃప్రారంభిస్తే హోటళ్లు మునుపటిలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయని హోటల్ అసోసియేషన్ తెలిపింది. గ్యాస్ కంపెనీలు త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని హోటల్ యజమానులు కోరుతున్నారు.

Exit mobile version