Prajwal Revanna: సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్న జేడీయూ మాజీ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూర్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈ సెక్స్ టేపుల వ్యవహారం బయటపడిన తర్వాత గత నెలలో ప్రజ్వల్ దేశం వదలి జర్మనీ పారిపోయాడు. అతడిని రప్పించేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో పాటు, ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు అతనికి ఉన్న దౌత్యపరమైన పాస్‌పోర్టు రద్దు ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో సోమవారం ఓ వీడియో మెసేజ్‌లో ప్రజ్వల్ మాట్లాడుతూ.. తాను ఈ నెల 31న బెంగళూర్ వస్తున్నానని, సిట్ ముందు విచారణకు హాజరవుతానని చెప్పారు. మరోవైపు అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు ఈ రోజు ప్రజ్వల్ బెంగళూర్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కోర్టు అతని పిటిషన్‌ని తిరస్కరించింది. ఆయన తరుపు న్యాయవాది అరుణ్ దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు కోట్టివేసింది.
Read Also: Putin: పుతిన్‌ని ఎలుగుబంటి నుంచి రక్షించిన వ్యక్తికి అత్యున్నత పదవి..
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ప్రజ్వల్ మ్యూనిచ్ నుంచి బెంగళూర్‌కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మే 31 తెల్లవారుజామున బెంగళూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కానున్నాడు. ఎయిర్‌పోర్టులోనే అతడిని అరెస్ట్ చేసేందుకు కర్ణాటక పోలీసులు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర కూడా ఈ రోజు చెప్పారు.
ఏప్రిల్ నెలలో కర్ణాటక వ్యాప్తంగా, ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి పట్టున్న హసన్ జిల్లాలో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా చెబుతున్న సెక్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ పరిణామాల తర్వాత ఏప్రిల్ 27న అతను జర్మనీ వెళ్లిపోయాడు. మరోవైపు రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెబుతూ ప్రజ్వల్ రేవణ్ణ, అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై ఫిర్యాదు నమోదైంది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మే 18న, సిట్ దాఖలు చేసిన దరఖాస్తు మేరకు ఎన్నికైన ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
