West Bengal: పశ్చిమ బెంగాల్‌లో గత 20 ఏళ్లుగా ప్రభుత్వం నిర్వహణలోని ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న ఆచారానికి స్వస్తి పలికారు. రెండు దశాబ్దాల తర్వాత హిందూ, ముస్లిం విద్యార్థులు తొలిసారిగా కలిసి బుధవారం మధ్యాహ్న భోజనం చేశారు. వివిధ మతాల విద్యార్థులకు వేర్వేరు భోజనం వడ్డిస్తున్న ఏళ్ల తరబడి ఆచారంపై విమర్శలు రావడంతో ఈ విధానాన్ని రద్దు చేసింది.
రెండు దశాబ్దాలుగా హిందూ, ముస్లిం విద్యార్థులు విడివిడిగా మధ్యాహ్న భోజనం అనే విధానం సోషల్ మీడియాలో విస్తృత ఆగ్రహానికి దారి తీసింది. మీడియా కూడా ఈ వార్తను హైలెట్ చేయడంతో బుధవారం ఈ పద్ధతికి స్వస్తి చెప్పారు. ఈ సంఘటన బెంగాల్‌లోని పూర్బ బర్ధమాన్ జిల్లాలోని నాదన్ ఘాట్ ప్రాంతంలోని కిషోరిగంజ్ మన్మోహన్ పూర్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
Read Also: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ప్రశంసలు
విద్యార్థుల మధ్య విభజనకు దారి తీసే ఈ ఆచారంపై పాఠశాల అధికారులు ఈ వారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వివక్షతో కూడిన ఆచారాన్ని ముగించాలని ఏకగ్రీవంగా అంగీకరించారు. భోజనం విషయంలో వేర్వేరుగా ఉంటున్నా, విద్యార్థులు అంతా కలిసి క్లాసులకు హాజరవుతారు. ఒకే బెంచీపై కూర్చొంటారు.
హిందూ విద్యార్థులకు హిందూ వంటవాడు వండిన ఆహారాన్ని వడ్డించగా, ముస్లిం విద్యార్థులకు వారి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి తయారుచేసిన భోజనం ఇచ్చేవారు. రెండు గ్రూపులకు వేర్వేరు సెట్ల ప్లేట్లు, గిన్నెలు, స్పూన్లు, అలాగే వేర్వేరు గ్యాస్ స్టవ్‌లు,ఓవెన్‌లను ఉపయోగించారు. గతంలో ఈ విధానంపై ప్రిన్సిపాల్ కూడా నిస్సహాయతను వ్యక్తం చేశారు. దీని వల్ల ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని చెప్పారు. మొత్తం మీద ఈ వివాదంపై జిల్లా కలెక్టర్ ఎంక్వైరీకి ఆదేశించారు. ప్రస్తుతం, బుధవారం నుంచి ఈ విధానం రద్దు అయింది.
